దేశంలో ధరలు అమాంతం పెరుగుతుండటంతో వచ్చే ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లోనూ ఆర్బిఐ కీలక వడ్డీ రేట్లను పెంచనుందని ఎస్బిఐ ఓ పరిశోధనలో అంచనా వేసింది. కాగా.. వడ్డీ రేట్లు పెంచినంత మాత్రాన ద్రవ్యోల్బణం వెంటనే కట్టడిలోకి రాలేదని విశ్లేషించింది.
2022 జూన్, ఆగస్టులో జరగనున్న ఆర్బిఐ ఎంపిసి భేటీలో రెపో రేటును 5.15 శాతానికి చేర్చనుందని ఎస్బిఐ ఈకోరప్ తన రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇది కరోనా ముందు నాటి స్థాయి. అయినా ధరల పెరుగుదల కొనసాగవచ్చని పేర్కొంది.
ఎస్బిఐ పరిశోధన వివరాలు రష్యా, ఉక్రెయిన్ పరిణామాలతో ఇంధన ధరలు మరింత పెరిగిపోతున్నాయి. ఇటీవలి మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలలో ఉక్రెయిన్ పరిణామాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి.
ఈ యుద్ధ ప్రభావంతో అహార్పోత్తులు, పానియాలు, ఇంధనం, రవాణ తదితర ద్రవ్యోల్బణం పెరుగుదలలో 52 శాతం ప్రభావితం అయ్యాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.
ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 7.8 శాతానికి ఎగిసి.. ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం, అధిక అహారోత్పత్తుల ధరలు హెచ్చు ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయి.