లుంబినీలో బౌద్ధ సంస్కృతి, వారసత్వ అంతర్జాతీయ భారత కేంద్రానిక ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
అమెరికా, చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, థాయ్‌లాండ్‌లతో సహా అనేక దేశాలు తమ కేంద్రాలను నిర్మించిన దశాబ్దాల తర్వాత బౌద్ధ తత్వశాస్త్రాన్ని ప్రోత్సహించే సాధనంగా లుంబినీలో భారత్ బౌద్ధ కేంద్రం నిర్మాణం మొదలయింది. దీనికి రూ 100 కోట్ల ఖర్చు అవుతుందని, పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పడుతుందని అంచనా.
సోమవారం ఉదయం నేపాల్‌లోని లుంబినీకి చేరుకున్న ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఘానా స్వాగతం పలికారు. తర్వాత ప్రధాని మోదీ తన ట్వీట్ లో “బుద్ధ పూర్ణిమ ప్రత్యేక సందర్భంగా, అద్భుతమైన నేపాల్ ప్రజల మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. లుంబినీ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను” అని తెలిపారు.
బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆయన మాయాదేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆయన వెంట నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య డాక్టర్ అర్జు రాణా దేవుబా పాల్గొన్నారు. ఆలయం పక్కనే ఉన్న అశోక స్తంభం వద్ద ఇరువురు ప్రధానులు దీపాలు వెలిగించారు. అనంతరం బోధి వృక్షానికి నీళ్లు పోశారు.
ప్రధాని మోదీ పర్యటన సరిహద్దు నుండి కేవలం 10 కి.మీ దూరంలో ఉన్న పవిత్ర స్థలంలో భారతదేశం యొక్క అధికారిక ఉనికిని గుర్తించడంతోపాటు, భారతదేశం-నేపాల్ సంబంధాలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందని స్పష్టం చేశారు.
బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. రాముడికి సైతం నేపాల్‌తో బంధం ఉంది. నేపాల్ లేకపోతే రాముడు అసంపూర్ణం. ఇరు దేశాల మధ్య పండుగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోందని మోదీ తెలిపారు. వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలని కోరారు.
ఈ క్రమంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో మోదీ కీలక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ మేరకు సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహనల ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు.
గౌతమబుద్ధుని జన్మస్థలమైన లుంబినిలోని ప్రఖ్యాత మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మోదీ నేపాల్ పర్యటన ప్రారంభమైనట్టు పీఎంఓ కార్యాలయం ఒక ట్వీట్లో తెలిపింది. నేపాల్‌లో అడుగుపెట్టగానే మోదీ ఓ ట్వీట్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుద్ధ పౌర్ణమి పర్వదినాన నేపాల్ ప్రజలతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందని, లుంబినిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నానని తెలిపారు.