ఒక వంక తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసి 40 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, మరో వంక పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు శతజయంతి సంవత్సరం కావడంతో ఈ నెలాఖరున ఒంగోలులో జరుపదలచిన పార్టీ వార్షిక సమావేశాలలు మహానాడును అత్యంత వైభవంగా జరపడం కోసం టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తూ వర్షాలు కురుస్తున్న కారణంగా ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహణకు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తే, అనుమతి నిరాకరించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఐఏఎస్ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పారు. మహానాడు నిర్వహణకు మినీ స్టేడియం అనుమతి ఇవ్వకపోతే, మహానాడు ఆగిపోతుందని వైసీపీ నేతలు భ్రమలో ఉన్నారని యనమల విమర్శించారు. కరోన కారణంగా గడిచిన మూడు సంవత్సరాలుగా మహానాడు నిర్వహించలేక పోయామని, అందుచేత తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా మహానాడు కోసం ఎదురుచూస్తున్నారని, మహానాడును అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని తెలిపారు.
కాగా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడుపుతున్నారని యనమల తీవ్రంగా విమర్శించారు. 1956 – 2019 వరకు రాష్ట్రం అప్పు 2.57 లక్షల కోట్లు అని, మూడేళ్లలో ఎనిమిది లక్షలు కోట్ల అప్పులు చేసిన జగన్, ప్రభుత్వం నడిపే ఈ ఐదు సంవత్సరాల్లో అప్పులు రూ 11లక్షల కోట్లు దాటి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అప్పులు బడ్జెట్ ను మించి పోతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాదికి అప్పుల వడ్డీ కే లక్ష కోట్లు, రెవిన్యూ కార్యకలాపాలకు మరో లక్ష కోట్లు ఖర్చవుతున్నాయని చెబుతూ మరి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేసేది ఎంత? అని యనమల ప్రశ్నించారు. రాష్ట్ర సహజ వనరులను జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారని, శాండ్ మైన్ లను తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేస్తున్నారని విమర్శించారు.
బస్ చార్జీలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ పై టాక్స్ లను పెంచి, చెత్త పన్నులతో రాష్ట్ర ప్రజలను జగన్ బాదేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలను తన సొంత పత్రిక సాక్షిలో ప్రకటనలు ఇచ్చి తన పత్రిక నడుపుకోవడానికి జగన్ తాపత్రయ పడుతున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్వాధీన పరుచుకున్న కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాకు అందించాలని యనమల డిమాండ్ చేశారు.
తొలుత త్రోవగుంట వద్ద మహానాడు నిర్వహించటం కోసం నిర్ణయం తీసుకున్న స్థలాన్ని జిల్లాలోని పార్టీ నాయకులతో కలిసి యనమల పరిశీలించారు. స్థలానికి సంబంధించి నాయకులను అడిగి పూర్తి వివరాలు సేకరించారు. అదేవిధంగా స్థలానికి వెళ్ళడానికి ఉండే మరో మార్గాన్ని కూడా పరిశీలించారు.