సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఎపి ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసులోకి తిరిగి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు రీఇన్స్టేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఆ రోజు నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీఏడీకి రిపోర్టు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏబీవీపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఎపి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏబీవీని ఏపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. టిడిపి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వెంకటేశ్వరరావును విధులలో నుండి ఎపి ప్రభుత్వం తొలగించింది.
ఏబీవీకి గత నెల సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై సస్పెన్షన్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడంతో వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దయింది.
ఏబీవీ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసిపోవడంతో ఇకపై ఆ సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేస్తూ పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ముగించింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు రీఇన్స్టేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా, కనీసం జీతం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తూ వస్తున్నది. జీత, భత్యాలు ఇవ్వాల్సిందే అని ఉన్నత న్యాయస్థానాలు గతంలో తీర్పులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సుప్రీం కోర్ట్ తీర్పు అనంతరం కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ వస్తున్నది.
గత వారం ఆయన స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి, సుప్రీంకోర్టు ఉత్తరువు దృష్ట్యా తనకొక పోస్టింగ్ ఇవ్వాలని కోరడం కోసం వరుసగా రెండు రోజులు వెళ్లినా కలవకుండా ఆయన మొఖం చాటేశారు. చివరకు కోర్ట్ ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుందనే ఇప్పుడు సస్పెన్షన్ రద్దు చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.