మూడేళ్ళ తరవాత జమ్మూ కాశ్మీర్ లో అమర్నాథ్ కు ఈ ఏడాది అనుమతి ఇస్తునందున యాత్రికుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా యాత్రకు అనుమతి ఇవ్వలేదు. అంతకు ముందు 2019లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు, రాష్ట్ర హోదాను రద్దుచేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో అల్లర్లు చెలరేగవచ్చని అర్ధాంతరంగా యాత్రను కుదించివేశారు.
ఇటీవల కాలంలో సహితం కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు లక్షిత దాడులకు పాల్పడుతూ ఉండడంతో యాత్రికుల భద్రతకు ఎటువంటి ప్రమాదం కాకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం అత్యున్నత అధికారిక సమావేశంలో భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపి, తగు సూచనలు చేశారు.
మొదటిసారిగా, యాత్రికులు అందరికి ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ట్యాగ్స్, రీడర్స్‌ను ఉపయోగించి యాత్రికులను వైర్లెస్ విధానంలో నిరంతరం గమనించే ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ఎఫ్ఐడీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటీఫికేషన్. ఇది ట్యాగ్స్, రీడర్స్‌తో కూడిన వైర్లెస్ ట్రాకింగ్ సిస్టమ్.
చేతితో పట్టుకెళ్లగలిగిన లేదా స్తంభాలు, భవనాల వంటి స్థిరంగా ఉండేవాటికి అమర్చగలిగిన పరికరాలను దీనిలో ఉపయోగిస్తారు. వీటికి సమీపంలో ఉండే వస్తువులు లేదా వ్యక్తుల సమాచారాన్ని, గుర్తింపును తెలియజేసేందుకు రేడియో తరంగాలను వాడతారు.
ఈ ట్యాగ్స్ గోప్యంగా సంకేత భాషలో సమాచారాన్ని తీసుకెళ్తాయి. అదేవిధంగా సీరియల్ నంబర్స్, క్లుప్తమైన వివరణలను తీసుకెళ్తాయి. వైమానిక పరిశ్రమల్లో ఉపయోగించే హై మెమరీ ట్యాగ్స్‌ను కూడా ఉపయోగిస్తారు.
రీడర్‌తో రేడియో తరంగాలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, యాంటెన్నాలను ఈ ట్యాగ్స్ ఉపయోగించుకుంటాయి. లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించుకుంటాయి.
ఈ ట్యాగ్స్ తిరిగి పంపించే రేడియో తరంగాలను హోస్ట్ కంప్యూటర్ విశ్లేషిస్తుంది. వస్తువులను, వ్యక్తులను గుర్తించడానికి ఆర్ఎఫ్ఐడీలకు నేరుగా కనిపించనక్కర్లేదు. ఆర్ఎఫ్ఐడీ లను ప్రతి చోట వాడవచ్చు. రిటెయిల్ వ్యాపారులు తమ వస్తువుల జాడను గుర్తించేందుకు వీటిని వాడతారు.
ప్రయోగశాలలో తాళాలు, క్రెడిట్ కార్డులు, గ్రంథాలయంలోని పుస్తకాలు వంటివాటికి కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ ట్యాగ్స్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. అయితే హ్యాకర్లు సైడ్ చానల్ అటాక్స్ ద్వారా సమాచారాన్ని రాబట్టడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ట్యాగ్ మాన్యుఫ్యాక్చరర్లు ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉంటారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రతి అమర్నాథ్ యాత్రికునికి ఆర్ఎఫ్ఐడీ కార్డ్ ఇస్తారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బీమా చేస్తారు. యాత్ర మార్గంలో టెంట్ సిటీ, వైఫై హాట్‌స్పాట్స్, సరైన లైటింగ్ సదుపాయాలను కల్పిస్తారు.