వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులు రూ,,7660 కోట్లు దొంగిలించినట్లు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘాలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశాయి.
ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. 2018 నుంచి 2022 వరకు 14, 15 వ ఆర్థిక సంఘాల నిధులను కేంద్ర ప్రభుత్వం రూ,, 7,660 కోట్లను రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిందని గుర్తు చేశారు.
అయితే, సర్పంచులకు తెలియజేయకుండా, చెక్కుల పై సర్పంచుల సంతకాలు తీసుకోకుండా, పంచాయతీ బోర్డు తీర్మానాలు లేకుండా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి, తన స్వంత అవసరాలకు, స్వంత పథకాలకు వాడేసుకుందని ఆరోపించారు.
రాత్రికి రాత్రే అడ్డగోలుగా నిధులు దారి మళ్లించడంతో పంచాయితీ ఖాతాలు జీరో /నిల్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయని తెలిపారు. దీంతో సర్పంచులు ఖంగుతిన్నారని, గ్రామాల అభివృద్ధికి నిధులు లేవని గగ్గోలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల సర్పంచులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆం.ప్ర. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని గవర్నర్ కు తెలిపారు.
దీనివలన గ్రామాలలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ మొదలగు సౌకర్యాలను తమ గ్రామాల ప్రజలకు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వవలసిన నిధులను ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను హైజాక్ చేయడం దుర్మార్గం అని స్పష్టం చేశారు.
ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధం, ఇది అనైతికం, అన్యాయం, దుర్మార్గం ఒకరకంగా రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఇది 73,74 వ రాజ్యాంగ సవరణ చట్టాల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ అధిపతిగా జోక్యం చేసుకొని, దొంగిలించిన ఈ సొమ్మును సర్పంచు లకు తిరిగి ఇప్పించ వలసిందిగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ మేరకు ఆదేశించవలసిందిగా కోరుతూ వారి గవర్నర్ ను కోరారు.