తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ వివిధ దేశాలను వెంటాడుతున్న బీఏ4 కరోనా వేరియంట్ హైదరాబాద్‌ను తాకడంతో వైద్య వర్గాలు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.
కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి కరోనా టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. అయినా కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగతూనే ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో తీవ్రస్థాయిలో వ్యాప్తిలో ఉంది.
రోజు రోజుకు కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూ అత్యంత ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజుకో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా బీఏ4 కరోనా వేరియంట్ ఈ నెల 9న దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నమోదు అయింది.
ఈ వేరియంట్ దేశంలోని మిగతా నగరాలకు వ్యాప్తి చెందే ప్రమాదముందని భారత వైద్య పరిశోధనా మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారికీ, రెండు డోస్‌ల టీకా తీసుకున్న వారీకీ ఈ వేరియంట్ సోకుతున్నట్లు నిర్దారణ అయింది.
ఇప్పటికే చైనా, ఉత్తర కొరియా, దక్షిణాఫ్రికా దేశాలు కరోనా కొత్త వేరియంట్లతో అల్లాడిపోతున్నాయి. బీఏ4 కట్టడికి ఆ దేశాలు లాక్‌డౌన్‌ను కూడా విధిస్తున్నాయి.అ యితే హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎలాంటి కరోనా నిబంధనలు అమలులో లేకపోవడంతో బీఏ4 పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
దీంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రజల్లో మరోసారి దడ మొదలైంది. ప్రస్తుతం తెలంగాణలో బీఏ2 వేరియంట్ వ్యాప్తిలో ఉంది. ఇక కరోనాతో ముప్పు లేదని కొద్ది రోజులుగా నిబంధనలు పక్కనబెట్టి తిరుగుతున్న హైదరాబాద్ వాసులను ఇప్పుడు బీఏ4 వేరియంట్ భయం వెంటాడుతోంది.
రాష్ట్రంలో తాజాగా 40 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను కలుపుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7, 92, 842 కు చేరింది. కరోనాతో చికిత్స పొందుతూ మరో 46 మంది కోలుకున్నారు.
కొద్ది రోజులుగా కరోనాతో మరణాలు సంభవించడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13054 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో అర్హులైన అందరికీ రెడు డోస్‌ల టీకాను వేయడం పూఇ కాగా… 15- 17 ఏళ్ల చిన్నారులకు 79శాతం మందికే రెండో డోస్ టీకా వేశారు.