బీహార్, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పిడుగులు పడటం, కొండచరియలు విరిగిపడటంతో బీహార్‌లో 33 మంది, అసోంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
అసోంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎనిమిదిమంది, మేఘాలయలో ముగ్గురు భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి.
16 జిల్లాల్లో మరణించిన 33 మంది కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశించినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వద్ద, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. బీహార్‌లో 33 మంది మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
అసోంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నాగోన్, హౌజారు, కాచర్, దర్రాంగ్ నాలుగు జిల్లాల్లో పరిస్థితి ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం 29 జిల్లాల్లో దాదాపు 7.12 లక్షల మంది వరదల బారిన పడ్డారు.
నాగావ్ జిల్లాలో 3.36 లక్షల మంది, కచార్ జిల్లాలో 1.66 లక్షలు, హౌజారులో 1.11 లక్షల మంది, దర్రాంగ్ జిల్లాలో 52,709 మంది ప్రభావితమయ్యారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
కాచర్, లఖింపూర్, నాగావ్ జిల్లాల్లో వరద నీటిలో మునిగి ఇద్దరు పిల్లలతో సహా నలుగురు శుక్రవారం మరణించారని పేర్కొంది. కుండపోత వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో దిమా హసావో జిల్లా హఫ్లాంగ్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఏప్రిల్ 6 నుంచి శనివారం వరకూ వరదల కారణంగా తొమ్మిదిమంది, కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారని, మరో ఏడుగురు గల్లంతయ్యారని అసోం అధికారులు తెలిపారు.
80,036.90 హెక్టార్ల పంట భూములు మునిగిపోయాయి. 2,251 ముంపు గ్రామాల్లో 43,090 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి, అనేక రోడ్లు వాహనాలు వెళ్లేందుకు పనికిరాకుండా పోయాయి.
74,705 మంది వరద ప్రభావిత ప్రజలు ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 234 సహాయ శిబిరాల్లో ఉన్నారు. ఆరు లక్షల మందికి పైగా నష్టపోయారు. అసోం అంతటా కనీసం 20 వాగులు తెగిపోయాయని, అనేక వంతెనలు కొట్టుకుపోయాయని లేదా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుంచి శుక్రవారం ఒక మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో, మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మేఘాలయలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరో ముగ్గురు మరణించారు.
అసోం జమునాముఖ్ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్ గ్రామాలు పూర్తిగా నీట మునగడంతో 500లకు పైగా కుటుంబాలు రైల్వే ట్రాక్‌లపై రోజులు గడుపుతున్నాయి. రెండు గ్రామాలను వరదలు ముంచెత్తాయి రైల్వే ట్రాక్ కాస్త ఎత్తులో ఉండటంతో అది వరద నీటిలో మునిగిపోలేదు.
దీంతో ఈ గ్రామాలకు చెందిన కుటంబాలు సర్వం కోల్పయి ట్రాక్‌పై టార్ఫలిన్ షీట్లతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. ఐదు రోజులుగా తమ పరిస్థితి ఇలాగే ఉందని , తినడానికి తిండి కూడా దొరకట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
” మొదటి మూడు రోజులు గుడారాలు కూడా లేవు”. ఆ తర్వాత మాదగ్గర ఉన్న డబ్బులతో టార్పలిన్ షీట్లు తీసుకొచ్చుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. తాగడానికి నీళ్లు లేవు. రోజుకు ఒక పూటే తింటున్నాం” అని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ బలగాలతో పాటు స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో రెండు లక్షల మంది నిర్వాసితులయ్యారు. 10 మంది మరణించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాల వల్ల ప్రభావితమయ్యాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళను తాకనున్నాయి. దీంతో కేరళ రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంది కర్ణాటకలోనూ వర్షాలు కురుస్తున్నాయి.