గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడింది. కాస్త ఉపశమనం పొందేలా కేంద్రం చర్యలు తీసుకొంది. లీటర్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు పన్ను తగ్గించే విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది.
దీంతో పలు రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 2.41, డీజిల్ పై రూ. 1.36 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ పెట్రోల్ పై రూ. 2.48, డీజిల్ పై రూ. 1.36 తగ్గించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ వెల్లడించారు. ఒడిశా పెట్రోల్ పై రూ. 2.23, డీజిల్ పై రూ. 1.36 తగ్గించింది.
పన్నులు తగ్గించడం విషయంలో కొన్ని రాష్ట్రాలు స్పందించడం లేదు. రాష్ట్రాలు తగ్గిస్తాయని చూడడం న్యాయం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ టి. రాజన్. ధరలు పెంచిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరని కేంద్రం, ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇక భారతదేశంలో ప్రతి వస్తువు ధరలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు రోజురోజుకు అధికమవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి.
దీంతో చమురు, గ్యాస్, నిర్మాణ రంగ వస్తువులపై విధించే సంకాలు తగ్గించింది. తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై రూ. 9.50, డీజిల్ పై రూ. 7 తగ్గే అవకాశం ఉంది. గత సంవత్సరం దీపావళి సమయంలో లీటర్ పెట్రోల్ రూ. 5, డీజిల్ పై రూ. 10 తగ్గించిన సంగతి తెలిసిందే.
ఈ సమయంలో పలు రాష్ట్రాలు తమ వంతు పన్ను తగ్గించాయి. అయితే.. కొన్ని రాష్ట్రాలు స్పందించడం లేదు. రానున్న రోజుల్లో ఏ రాష్ట్రం పన్నులు తగ్గిస్తాయో చూడాలి.
పెట్రోలు, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను తక్షణమే తగ్గించడం ఉత్తర ప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాల కర్తవ్యమని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలం తర్వాత కాస్త ఉపశమనం కల్పించిందని చెప్పారు.
పెట్రోల్, డీజిల్ పై కేంద్రం వ్యాట్ తగ్గించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర 30 శాతం వ్యాట్ విధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ధరలు తగ్గిస్తే.. 80 రూపాయలకే పెట్రోల్ వస్తుందని తెలిపారు.
పెట్రోల్, డీజీల్‌పై కేంద్రం తగ్గించిన ఎక్సయిజ్ ఏమాత్రం సరిపోదని, ఇంధన ధరలను అరికట్టేందుకు మరిన్న చర్యలు అవసరమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. గత ఆరేడేళ్ల క్రితం పెట్రోల్, డీజీల్ ధరలు ఎంతెంతున్నాయో ఆమేరకు కేంద్రం తగ్గించాలని డిమాండ్ చేశారు.
రెండు నెలల క్రితం కేంద్రం పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.18.42 పెంచిందని, కానీ, ఈరోజు కేవలం రూ.8 తగ్గించిందని, అదేవిధంగా డీజీల్ ధర లీటర్‌కు రూ.18.24 పెంచింది, ఇప్పుడు కేవలం రూ.6లు తగ్గించిందని కాబట్టి ఇదేమంత భారీ తగ్గింపు కాదని ఆయన ఎద్దేవా చేశారు.
మళ్ళీ ధరలు పెరుగుతాయన్న రాహుల్
ఇలా ఉండగా, పెట్రోలు, డీజిల్‌లపై సుంకాలను తగ్గించిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్లో రానున్న రోజుల్లో చిన్న మొత్తాల్లో ఈ ధరలు పెరుగుతాయని జోస్యం చెప్పారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో తగ్గుదల కేవలం కంటి తుడుపు చర్య అని మండిపడ్డారు. 2020 మే 1న లీటరు పెట్రోలు ధర రూ.69.50 అని; 2022 మార్చి 1న రూ.95.40 అని; 2022 మే 1న రూ.105.40 అని; 2022 మే 22న రూ.96.70 అని తెలిపారు.
ఇక ఇప్పుడు పెట్రోలు ధర రోజువారీ 80 పైసలు, 30 పైసలు మోతాదుల్లో వృద్ధి చెందుతుందని అనుకోవచ్చునని పేర్కొన్నారు. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం నుంచి నిజమైన ఉపశమనం పొందే హక్కు ప్రజలకు ఉందని ఆయన స్పష్టం చేశారు. మార్చి-మే మధ్య కాలంలో పెరిగిన ధరలు కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించినదాని కన్నా ఎక్కువ అని చెప్పారు.