ఆస్ట్రేలియా నూతన ప్రధాన మంత్రిగా ఆంటోనీ అల్బనీస్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం కాన్ బెర్రాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం జరగడం విశేషం. విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ఆర్థిక మంత్రి కాటీ గల్లాఘర్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జపాన్ లో జరుగుతున్న క్వాడ్ సమావేశాలకు హాజరు కావడం కోసం విమానం ఎక్కారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షులు అధ్యక్షులు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదిలను తాను స్వయంగా కలుస్తానని ప్రధాన మంత్రిగా ఎన్నికైన అనంతరం ఆయన వెల్లడించారు.
వాతవరణ మార్పులపై చర్చించేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ కు గత వారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 151 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 72 స్థానాల్లో విపక్ష లేబర్ పార్టీ స్థానాల్లో విజయం సాధించగా, మారిసన్ పార్టీ కేవలం 51 స్థానాలకే పరిమతమైంది. దీంతో ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా అల్బనీస్ ఆంటోనీ ఎన్నికయ్యారు.
ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తన ఓటమిని అంగీకరించి నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. 2007 తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నూతన ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర దేశాధినేతలు అభినందనలు తెలిపారు.