ప్రపంచ దేశాల అప్పు రూ 23,100 లక్షల కోట్లకు (2021నాటికి) చేరుకుందని, ఆయా దేశాలు చేస్తున్న రుణాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. చేసిన రణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపుల కోసం ఆయా దేశాల్లో కీలకమైన ప్రభుత్వ సేవలకు కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొన్నది.
దాదాపు 100కు పైగా దేశాలు రుణ వాయిదాల చెల్లింపు కోసం కీలకమైన ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యంపై వ్యయాన్ని తగ్గించుకోనున్నాయని తెలిపింది. ప్రపంచ దేశాల అప్పులపై ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాలలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, కుటుంబాలు, వ్యాపారవేత్తలు చేసిన అప్పుల్ని ‘గ్లోబల్ డెట్’గా ఐఎంఎఫ్ పేర్కొన్నది.
ప్రపంచ దేశాల మొత్తం రుణాలు 2021 నాటికి 303 ట్రిలియన్ డాలర్ల (సుమారుగా రూ.23,100 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంత క్రితం గ్లోబల్ డెట్ 226 ట్రిలియన్ డాలర్లుగా (రూ.17,402 లక్షల కోట్లు) ఉంది. రుణాలు ఒక్క ఏడాదిలో రికార్డ్ స్థాయిలో మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో అప్పులు ఎప్పుడూ పెరగలేదని నివేదిక తెలిపింది.
కరోనా సంక్షోభం ఆయా దేశాల్ని అనివార్యంగా అప్పుల ఊబిలో కూరుకపోయేలా చేసింది. ఈ సమస్యను ఉక్రెయిన్ సంక్షోభం మరింత పెంచింది. గ్లోబల్ డెట్‌లో తక్కువ ఆదాయమున్న దేశాలు చేసిన అప్పులు, కుటుంబ రుణాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.
కరోనాకు ముందే గ్లోబల్ డెట్ పెద్ద మొత్తంలో ఉంది. కానీ కరోనా తర్వాత అది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అభివృద్ధి చెందిన దేశాలు, చైనా సైతం రుణాలు చేయాల్సి వచ్చింది. మూడో ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలపై రుణ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ పరిశోధన కూడా తెలిపింది.
భారీ స్థాయిలో ఉన్న రుణాల చెల్లింపు కోసం 100కు పైగా దేశాలు విద్య, వైద్యం, సామాజిక భద్రత..మొదలైన వాటిపై కోతలు విధించాల్సిన పరిస్థితి వచ్చిందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. ఆయా దేశాలు రుణ చెల్లింపులో విఫలమైతే అది ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.
దీనివల్ల ఉపాధి కల్పన, విస్తరణకు నిధులు అందుబాటులో ఉండవని, దివాళా కేసుల పరిష్కారం సంక్లిష్టంగా మారుతుందని, వ్యాపార సంస్థలు రుణాలు చెల్లించలేకపోతాయని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది. అంతేకాదు వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు ఆహారం, ఇంధనంపై ఖర్చును తగ్గిస్తారని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో 60 శాతం రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయట.