భారత్ జపాన్లు సహజసిద్ధ స్నేహ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా టోక్యోకు చేరిన ప్రధాని తొలిరోజు సోమవారం భారతీయ సంతతిని ఉద్ధేశించి ప్రసంగించారు. భారతదేశానికి జపాన్ నుంచి తరాల నుంచి నిరంతర సాయం అందుతోందని, భారతదేశ ప్రగతి పథంలో జపాన్ పెట్టుబడులు కీలక పాత్ర వహించాయని ప్రధాని తెలిపారు.
ముందుగా చెప్పాలంటే ఈ తూర్పు దేశంతో భారత్ అనుబంధం ఆధ్మాత్మికం తరువాతి క్రమంలో ఇది ఇతర రంగాలలో పరస్పర సహకారానికి, శిఖర స్థాయిలో ఆత్మీయతానుబంధానికి దారితీసిందని ప్రవాస భారతీయులతో భేటీలో హర్షం వ్యక్తం చేశారు.
క్వాడ్ నేతల సదస్సుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాలు ప్రకృతిసిద్ధమైన స్నేహసంబంధాలను సంతరించుకున్నాయని, అందుకే ఈ బంధం కాలానికి అతీతంగా మరింత ధృఢం అవుతోందని మోదీ పేర్కొన్నారు.
ఇప్పుడు ఉద్రిక్తతల ప్రపంచానికి బుద్ధ భగవానుడి నిర్ధేశిత పథం అత్యవసరం అని, ఒకటి తరువాత ఒకటిగా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు శాంతి అహింసల మార్గం అత్యుత్తమమైనదని ప్రధాని తెలిపారు. ఇది ఈ తూర్పు దిక్కునుంచి కాంతికిరణ పుంజంగా మారుతుందని పేర్కొన్నారు.
తాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా భారతీయ సంతతి వారి ఆదరణ తనను కట్టిపడేస్తుందని ప్రధాని తెలిపారు. భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఏళ్లయిన వారు చాలా మంది ఉంటారని, జపాన్ సంస్కృతిని క్రమేపీ అలవర్చుకోవడం జరుగుతుందని తెలిపారు.
అయితే వారిలో భారతీయ ఆచార వ్యవహారాలు, వేషభాషల పట్ల అభిమానం మొక్కవోకుండా ఉంటోందని తాను గమనించానని ఇది పెరుగుతూ పోతోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఓ వైపు భారతీయ సంతతి సమూహం ప్రధాని మోదీని చూడగానే భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తూ ఉండగా ప్రధాని ప్రసంగం సాగింది.