జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న క్వాడ్ దేశాధినేతల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చొరవతో భారత్, జపాన్ లతో సహా 12 దేశాలతో కలిపి చైనా వ్యతిరేక ఆర్ధిక కూటమి ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)’ ఏర్పడింది.
ఆర్థిక, వాణిజ్య రంగాల్లో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునే దిశగా ఏర్పడిన ఈ కూటమిలో దేశాలకు ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 40 శాతం వాటా ఉండడం గమనార్హం. సోమవారం టోక్యోలో జరిగిన కీలక సమావేశంలో జో బైడెన్, భారత్, జపాన్ ప్రధానులు నరేంద్ర మోదీ, ఫుమియో కిషిదా తదితర దేశాధినేతల సారథ్యంలో ఆ మేరకు కొత్త ఒప్పందం అమల్లోకి వచ్చింది.
ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన ఇతర దేశాలలో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, బ్రూనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంత సానుకూల అభివృద్ధికి అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా బైడెన్ చెప్పారు.
ఎగుమతి-దిగుమతులు, పర్యావరణహిత ఇంధన రంగాలు, అవినీతి నిరోధక చర్యలకు సంబంధించి ఆసియా ఎకానమీలతో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఐపీఈఎఫ్ సహకరిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. 21వ శతాబ్దంలో తలెత్తే వివిధ సవాళ్లను ఈ ప్రాంతపు భావసారూప్యపు దేశాలతో కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకే ఈ ఆర్థిక కీలక చట్రం ఏర్పాటు అయినట్లు బైడెన్ తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో-పసిఫిక్ ఇంజన్‌గా మారాలని.. ఐపీఈఎఫ్ ఒప్పందానికి పరస్పర విశ్వాసం, పారదర్శకత పునాదులు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీశాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్ కోసం మన ఆర్థిక వ్యవస్థలను సమష్టిగా సిద్ధం చేయడానికి ఐపీఈఎఫ్ ఉపకరిస్తుందని సభ్య దేశాలు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
అయితే ఈ ఒప్పందంలో పలు లోపాలు ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. సభ్య దేశాలకు టారి్‌ఫల తగ్గింపు వంటి రాయితీలు, అమెరికా మార్కెట్లలో ప్రవేశానికి అధిక అవకాశాలు ఇందులో లేకపోవడం ప్రధాన కొరతగా చెబుతున్నారు.
గతంలో అమెరికా ఆధ్వర్యంలో విజయవంతంగా నడచిన ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం (టీపీపీ) మాదిరిగా తాజా ఒప్పందం ఆకర్షణీయంగా లేదని స్పష్టం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీపీపీ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. దాని స్థానంలో ఐపీఈఎ్ఫను తీసుకొచ్చి చైనా ఆర్థిక ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని బైడెన్ యంత్రాంగం కొత్త ఒప్పందానికి చొరవ తీసుకుంది.