ఢిల్లీలోని కుతుబ్ మీనార్ కేసులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాకేత్ కోర్టుకు మంగళవారం ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మీనార్ స్మారక చిహ్నాన్ని విష్ణు స్తంభంగా మార్చాలని డిమాండ్ చేస్తూ హిందూ పిటిషనర్లు సాకేత్ కోర్టును అభ్యర్థించారు.
కుతుబ్ మినార్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ధ్వంసం చేసిన 27 ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తీర్పును ఢిల్లీ కోర్టు జూన్ 9వ తేదీకి రిజర్వ్ చేసింది. మంగళవారంనాడు ఢిల్లీలోని సాకేత్ కోర్టులో దీనిపై విచారణ జరిపింది.
కుతుబ్ మీనార్ ఉన్న ప్రదేశంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని హిందూ పిటిషనర్ల అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) వ్యతిరేకించింది. కుతుబ్ మీనార్ 1924 సంవత్సరం నుంచి రక్షిణ స్మారక చిహ్నంగా ఉందని, దీని నిర్మాణాన్ని ఇప్పుడు మార్చలేమని ఎఎస్ఐ పేర్కొంది.
కుతుబ్ మీనార్కు రక్షిత హోదాను మంజూరు చేసే సమయంలో స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్దరణకు అనుమతించం అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు. హిందూ పిటిషనర్ల అభ్యర్థన చట్టపరం కాదని ఆర్కియాలజీ శాఖ తెలిపింది.
కుతుబ్ మీనార్ కాంప్లెక్స్ రక్షిత స్థలమని, ఇందులో పూజలు చేసే హక్కు ఎవరికీ లేదని, అధికారులు కోర్టుకు నివేదించారు. కుతుబ్ మీనార్ రాజా విక్రమాదిత్య నిర్మించారని, దీనికి విష్ణు స్తంభం అని పేరని విహెచ్పీ అధికార ప్రతినిధి చెప్పారు. మసీదు నుంచి 15 మీటర్ల దూరంలో మీనార్ కు దక్షిణాన తవ్వకాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తాజాగా నిర్ణయించారు.
తవ్వకాల నివేదికను సమర్పించాలని సాంస్కృతిక శాఖ ఎఎస్ఐను కోరింది. యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కుతుబ్మీనార్ వద్ద మహాకాల్ మానవ్ సేవ, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు ఇటీవల ప్ల కార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. దీంతో కుతుబ్ మీనార్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.