మహారాష్ట్రలోని రవాణా మంత్రి అనిల్ పరాబ్ నివాసంపై గురువారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు జరుపుతున్నది. రత్నగిరి జిల్లాలోని దాపోలి తీర ప్రాంతంలో భూమి కొనుగోలు ఒప్పందంలో మంత్రి అవతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, దీంతో అనిల్‌పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇడి తెలిపింది.
అనిల్‌తో పాటు పలువురు నివాసాలపై ఏకకాలంలో సోదాలు జరిపింది. పూణె, ముంబయి, దాపోలి ప్రాంతాలతో పాటు అనిల్ నివాసంలో ఈ సోదాలు జరిగాయి. 2017లో అనిల్ దాపోలీ ప్రాంతంలో ఓ భూమిని రూ.కోటికి కొనుగోలు చేశారు. దాన్ని 2019లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఆ తర్వాత 2020లో ముంబయికి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కడమ్‌కు రూ.1.10కోట్లకు ఆ భూమిని విక్రయించారు. అయితే 2017-2020 మధ్య ఆ భూమిలో పరబ్ తన వ్యాపార భాగస్వామి సదానంద్తో కలిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఒక రిసార్ట్‌ను నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై ఐటి శాఖ గతంలో విచారణ జరపగా.. ఆ రిసార్ట్ నిర్మాణం కోసం రూ.6కోట్లకు పైగా నగదును వెచ్చించారని తేలింది. ఆ నగదుకు సంబంధించి లెక్కలు లేవని పేర్కొంది.