ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన గురువారం సాయంత్రం అత్యంత ఉత్సాహంగా జరిగినా, ఈ సందర్భంగా ఫెడరలిజంపై వేదికపై నుండే ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ నిలదీయడంతో ఖంగు తినవలసి వచ్చింది. కేంద్రం రాష్ట్రాల పట్ల మరీ ముఖ్యంగా తమిళనాడు పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ ప్రధాని ముందర స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో ప్రధాని ఇరకాటంలో పడ్డారు. వెంటనే తేరుకుని తమిళ భాష ప్రోత్సాహానికి కేంద్రం కట్టుబడి ఉందంటూ తమిళవాదం వినిపించే యత్నం చేశారు. స్టాలిన్ ద్రవిడ మోడల్‌కు ఇరుసుగా ఉన్న తమిళాన్ని ప్రస్తావించడం ద్వారా తాను తమిళులకు వ్యతిరేకం కాదని సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి ఓ బీజీపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రధాని అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పాల్గొనడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పైగా స్టాలిన్ ముఖ్యమంత్రి ఆపదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ప్రధానికి పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు బిజెపి చేస్తుంటే డీఎంకే ప్రభుత్వం అన్నివిధాలా సహకరించింది కూడా.
మరోవంక, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేతలు సహితం పోటీపడి ప్రధానికి స్వాగత సన్నాహాలు చేశారు. దానితో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానికి దారుల వెంట ఇరువైపులా సాధారణ ప్రజలు సహితం పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ ఘనస్వాగతం స్థానిక బిజెపి నాయకులను సహితం విస్మయంకు గురిచేసింది.
అధికారిక కార్యక్రమం వేదికపైన కూడా స్టాలిన్, ఇతర మంత్రులు ఉన్నప్పటికీ అంతా తానే అన్నట్లు ప్రధాని కలియతిరిగి సందడి చేశారు. అయితే, స్టాలిన్ మాట్లాడుతూ, నిజమైన సమాఖ్య ఫెడరలిజం స్పూర్తికి కట్టుబడి ఉండాలని కేంద్రాన్ని కొడదాం ద్వారా రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షత చూపుతున్నదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తమిళనాడులో తమిళమే మాట్లాడతానని తేల్చి చెబుతూ కేంద్రంతో సంఘీభావంగా ఉంటామంటూనే..రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సత్వర పూర్తికి సహకరించాలని, రాస్ట్రానికి కేటాయింపులు పెంచాలని, నీట్‌నుంచి తమిళనాడు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బహుశా ప్రధాని మోదీని ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఓ అధికారిక కార్యక్రమంలో నిలదీసిన సందర్భం లేదు. స్టాలిన్ డిమాండ్లకు ప్రధాని మోదీ అవునని కాని, కాదని కాని చెప్పకుండా దాటవేశారు. తాము నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశ పెట్టామని స్టాలిన్ గుర్తు చేశారు.
హిందీలాగే మద్రాస్ హైకోర్టులో తమిళ్‌ను అధికార భాషగా మార్చాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు స్వేచ్ఛగా చేపలు పట్టేందుకు వీలుగా శ్రీలంక నుంచి కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని సీఎం సూచించారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు.
రాష్ట్రాలతో కేంద్ర కలిసి పనిచేస్తేనే దేశాభివద్ధి సాధ్యమని చెబుతూ తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను విడుదల చేయాలని సభా ముఖంగా మోదీని కోరారు. అంతకుముందు చైన్నైలో రూ.2900 కోట్లతో పూర్తయిన రాష్ట్రానికి చెందిన ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
‘లైట్ హౌస్ ప్రాజెక్టు’ కింద రూ.116 కోట్లతో నిర్మించిన 1,152 గృహాలను ప్రధాని గురువారం ప్రారంభించారు. అదే విధంగా రూ.28,500 కోట్లతో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ లలో కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ మొత్తం కేంద్రమే అన్నట్లు ప్రచారం జరిగింది.
మరోవంక, మోదీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ట్విట్టర్ వేదికగా పోరు జరిగింది. ప్రధాని ఎప్పుడు తమిళనాడు పర్యటనకు వచ్చినా `గో బ్యాక్ మోదీ’ హ్యాష్‌ట్యాగ్ తో ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ సారి అట్లాగే జరిగింది. అయితే, ఈ పర్యాయం రాష్ట్ర బిజెపి సోషల్ మీడియా విభాగం `వణ్ణక్కం మోదీ’ హ్యాష్‌ట్యాగ్ తో పోటాపోటీగా సోషల్ మీడియాలో ఆయనకు స్వాగతం పలికారు.