టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్‌కు చేరుకున్న నిఖత్ జరీన్‌కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్ తో పాటు ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మూడు గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన ఈషా సింగ్, ఇండియన్ ఫూట్ బాల్ క్రీడాకారిణి సౌమ్య గూగులోత్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఇవ్వాల మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రీడాకారులు, అభిమానులతో కలిసి విమానాశ్రయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఆమె విమానాశ్రయం నుండి బయటకు రాగానే ఆమెకు మంత్రులు, క్రీడాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు పూల బోకే ఇచ్చి స్వాగతించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని, వాటి సహకారంతోనే నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ అయ్యిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ క్రీడాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ వచ్చిన తర్వాత వారందరికీ టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె తల్లిదండ్రుల త్యాగం, ప్రభుత్వ సహకారం, పట్టుదల వల్లనే నిఖత్ గొప్ప విజయం సాధించిందని కొనియాడారు. నిజామాద్‌కు చెందిన షూటర్ ఇషాసింగ్ కూడా షూటింగ్లో పతకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎంతో సహకారం అందిస్తోందనడానికి ఈ విజయాలే చెబుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే తను ఈ విజయం సాధించానని ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సి కవితలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎంఎల్‌సి కవిత సహకారంతో ఈ స్థాయికి వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం ఎన్నటికీ మర్చిపోలేనని నిఖత్ జరీన్ తెలిపింది.