వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం పార్టీ మనుగడకు కీలకమని గ్రహించిన టిడిపి సంస్థాగతంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టుతున్నది. వచ్చే పార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు.
ఒంగోలులో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైన మాహానాడులో ఆయన జ్యోతి వెలిగించి అధ్యక్షోపాన్యాసం చేస్తూ రాజకీయ పార్టీల్లో యువతను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని, పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసే వాళ్లకే అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు.
కాగా, వరుసగా మూడు సార్లు ఓటమి చెందిన వారికి పార్టీ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒంగోలు లో జరుగుతున్న మహానాడు మొదటి రోజు వెల్లడించారు. అదే విధంగా ఎవ్వరు కూడా పార్టీలో ఒకే పదవిలో వరుసగా రెండు సార్లు మించి కొనసాగరాదని కూడా తెలిపారు. ఆ విధానం మేరకు రెండు సార్లు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తాను ఈ మహానాడులో ఆ పదవి నుండి వైదొలుగుతున్నట్లు చెప్పారు.
ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే కొత్త రక్తం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. ఇది తన బలమైన కోరిక అని, ఇదే విషయంపై పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించానని వెల్లడించారు. ఈ నిర్ణయం మేరకు పలు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చవలసి ఉంటుంది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈలోగా కొంత మంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామని తెలిపారు. పని చేయని నేతలకు, ఇన్‌చార్జ్‌లకు అవకాశాలుండవని లోకేష్ తేల్చిచెప్పారు.
కాగా, రాష్ట్ర అప్పుల భారం రూ.8 లక్షల కోట్లకు పెరిగిందని చెబుతూ వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందని చంద్రబాబు నాయుడు విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో సంక్షేమం లేదని, అంతా మోసకారి సంక్షేమమే జరుగుతుందపేర్కొంటూ వైసీపీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని స్పష్టం చేశారు.
పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని, మద్యం, గంజాయి డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అంటూ ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ప్రభుత్వం గద్దె దిగిపోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోనసీమను సర్వనాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని చెబుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. జగన్ కు ఈ సారి ఎన్నికల్లో ఎలా బుద్ది చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని చంద్రబాబు భరోసా వ్యక్తం చేశారు.
క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రతి ఇంట్లో చర్చించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. జగన్ అండ్ కంపెనీ ఆదాయం పెరిగిందని, ఆయన అనుయాయూల ఆదాయం పెరిగిందని, ప్రజల ఆదాయం మాత్రం తగ్గిందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం వచ్చిందని గుర్తు చేస్తూ ఏపీలో ఉన్మాద పాలన సాగుతోందని ద్వజమెత్తారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం రాజీలేని పోరాటం చేయాలని టిడిపి అధినేత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకపు పాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
‘నేరస్తులు పాలకులయ్యారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారు. ఈ ఉన్మాద పాలనకు చరమగీతం పాడాలి. తెలుగుదేశం పార్టీకి త్యాగాలు కొత్త కాదు. ఎన్నో త్యాగాలు చేసిన వారు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ కోసం రాజీలేని పోరాటం చేయాలి’ అని స్పష్టం చేశారు.