శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యే సంవత్సరంలోగా ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేందుకు కృషి చేయాలని వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను పెను నినాదంగా మార్చి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలా చేస్తామని ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు.
శత జయంతి సందర్భంగా శనివారం పార్లమెంట్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి రఘురామకృష్ణరాజు నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ అందరివాడే గానీ కొందరి కాదని అంటూ ఆయన ఆశయ సాధన కేవలం జగన్మోహన్ రెడ్డితో మాత్రమే సాధ్యమని విజయవాడలో తమ పార్టీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టారని తెలిపారు.
రామారావు పార్టీలకు అతీతుడనే విషయం ఈ ఒక్క ఘటనతో స్పష్టమవుతుందని వివరించారు. మహా నాయకుడు ఎన్టీఆర్ నిద్రాహారాలు మాని కష్టపడి సినిమా రంగంలో పైకి ఎదిగారని, తన చిత్రాల ద్వారా సామాజిక చైతన్యం కలిగించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ 60వ ఏట రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు.
సంక్షేమ పథకాలకు రాష్ట్ర చరిత్రలో ఆద్యుడైన ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి కొత్త ఒరవడిని సృష్టించారని, బీసీలకు రిజర్వేషన్ మాటల్లో కాకుండా చేతల్లో చూపించి చిరస్మరణీయుడిగా నిలిచారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రాయలసీమ కరవు నివారణకు గాలేరు-నగరి, హంద్రీ నివా ప్రాజెక్టులను ప్రారంభించారని, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన చేశారని తెలిపారు.
మద్రాసీలమంటూ చిన్నచూపుకు గురవుతున్న వారికి తెలుగు వారిగా జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చిన ఎన్టీ రామారావుకు ఎన్ని అవార్డులిచ్చానా రుణం తీర్చుకోలేమని స్పష్టం చేశారు. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.
ఎన్టిఆర్ ఘాట్ వద్ద పలువురు టిఆర్ఎస్ నేతలు
ఇలా ఉండగా, ఎన్టిఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మొదటి సారిగా పలువురు టిఆర్ఎస్ నాయకులు బారులు తీరి నివాళులర్పించారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, లోక్‌సభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్రావు, శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్, పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.
అంతేకాదు, ఎన్‌టిఆర్‌కు కేంద్రం భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ప్రకటించారు. తెలంగాణాలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకరంగా మారినప్పటికీ ఎన్టిఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు భావిస్తున్నారు. కనీసం 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో వారు కొంతమేరకు ప్రభావం చూపగలరని అంచనా వేస్తున్నారు. అందుకనే వచ్చే ఏడు జరిగే ఎన్నికలలో వారి మద్దతు పొందేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.
మరోవంక, ప్రగతి నగర్, జూబ్లీ హిల్స్ లలో జరిగిన ఎన్టిఆర్ విగ్రహాల ఆవిష్కరణలో సహితం టిఆర్ఎస్ నాయకులు హడావుడి చేశారు. ఇంకోవైపు, ఎన్టిఆర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.