రాష్ట్రాల హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం హరించివేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుదిబండగా మారిందని ఆయన విమర్శించారు. గురువారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో సిఎం కెసిఆర్ జాతీయ జెండా ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బలమైన కేంద్రాం బలహీనమైన రాష్ట్రాలనేది కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత సిద్దాంతమని విమర్శించారు. రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి కేంద్రం వసూలు చేస్తున్నదనీ, రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తోందని విమర్శించారు.
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ రకరకాల ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు.రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇక నుంచైనా మానుకోవాలని డిమాండ్ చేశారు. భారత దేశంతోపాటు స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్‌గా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదని విమర్శించారు. ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా మతఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమన్నారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగిపోతే సమాజ ఐక్యతకు పెనుముప్పు వాటిల్లుతున్నదని హెచ్చరించారు.
అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరి కదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనకకు తీసుకపోవడం ఖాయమనీ, దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నదని ధ్వజమెత్తారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రగతిశీల ఎజెండానే పరిష్కారమని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలనీ, అందుకోసం దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించారు. రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని కేంద్రానికి మరోసారి స్పష్టం చేశారు.