అన్నయ్య చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. కేవలం సినీ రంగం,వారి సమస్యలకే పరిమితమవుతున్నారని చెప్పారు. మెగా ఫ్యాన్స్ ఎవరితో ఉండాలన్నది వారి వ్యక్తిగత విషయమని అంటూ వారంతా జనసేన వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, విశాఖలోని జనసేన ప్రాంతీయ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీ,ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదని, ,కేవలం పార్టీ పటిష్టతకు ఏమి ఆశించకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతం కోసం పాదయాత్రలు చేసే అవకాశం లేదని, ఆ తరహాలోనే ఏదైనా యాత్ర చేపట్టే అవకాశముందని నాగబాబు తెలిపారు. ఎన్నికల జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బూత్ కమిటీల నియామకంతో పాటు, పార్టీ నాయకులను పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తాము సైతం ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేధింపులు, విధ్వంసాలు, అవినీతి,అక్రమాలతో ఆరాచక పాలన సాగుతుందని ధ్వజమెత్తుతూ ఈ పాలనకు తెరదించేందుకు ప్రతి కార్యకర్త విధిగా పనిచేయాలని పిలుపిచ్చారు. అమలాపురంలో జరిగిన అల్లర్లకు జనసైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కావాలనే జనసైనికులపై తప్పుడు కేసులు బనాయించి, అధికార పార్టీ నాయకులు పైశాచిక ఆనందాన్ని పోందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఏన్నో ఏళ్లుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రుషికొండ ప్రాంతాన్ని అధికార పార్టీ నాయకులు వారి స్వలాభం కోసం సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం తుంగలోకి తొక్కి కొండల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని నాగబాబు విమర్శించారు.
పార్టీకి సంబంధించి అన్ని విభాగాలకు చెందిన కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని, అధినేత ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానని నాగబాబు తెలిపారు. కాగా, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని, ఎందుకంటే ప్రభుత్వానికి కనీసం చలనం లేదని విమర్శించారు.