బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన నాయకత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి గట్టెక్కారు. పార్లమెంటులోని 211 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆయన తమ నాయకుడిగా కొనసాగడానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, పార్లమెంటులోని 148 మంది టోరీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓట్ వేశారు.
అంటే 58.8 శాతం మంది ఆయనకు మద్దతు ఇవ్వగా, వ్యతిరేకంగా 41.2 శాతం మంది ఉన్నట్లు స్పష్టమైంది. ఆ సంఖ్య దీర్ఘకాలం పార్టీ నాయకుడిగా కొనసాగేందుకు అనుకూలంగా లేదని విమర్శకులు స్పష్టం చేస్తుండగా, ఆయన మద్దతుదారులు పార్టీలోని మెజారిటీ మద్దతు ఆయనకే ఉన్నదని గుర్తు చేస్తున్నారు. “ఇది రాజకీయాలకు, దేశానికి చాలా మంచి ఫలితం అని నేను భావిస్తున్నాను” అని జాన్సన్ సంతోషం వ్యక్తం చేశారు.
డౌనింగ్ స్ట్రీట్‌లో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో… నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రధాని బోరిస్ ఒక విందును ఏర్పాటు చేశారు. ఈ విందు పార్టీని పార్టీగేట్ కుంభకోణంగా పిలుస్తున్నారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాల్సిందిగా న్యూ గ్రే కమిషన్‌ను నియమించింది.
ఈ పార్టీగేట్ కుంభకోణానికి సీనియర్ నాయకత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై బోరిస్ పార్లమెంట్ వేదికగా క్షమాపణలు చెప్పినా.. విమర్శలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు.బ్రిటన్ సింహాసనాన్ని క్వీన్ ఎలిజెబెత్-2 అధిష్టించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా ఇటీవల లండన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరైన ఆయనకు సొంత పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 40 మందికి పైగా సభ్యులు బోరిస్ ప్రధాని పదవి నుండి దిగిపోవాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.
జాన్సన్ గత నెలలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో అంతకు ముందు చెప్పిన క్షమాపణలను పునరుద్ఘాటించారు. తన పర్యవేక్షణలో ఏమి జరిగిందో దానికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని, తప్పులు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలతో పాటు, ఆయన తన సొంత ఎంపీల నుండి వైదొలగాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.