నిత్యం సొంత పార్టీ, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలతో వార్తలలో నిలుస్తుంటే `తిరుగుబాటు’ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 60కి మించి సీట్లు దక్కబోవని జోస్యం చెప్పారు. పైగా, పార్టీకి బలమైన అభ్యర్థులు కూడా దొరకడం కష్టమే అని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష టీడీపీకి 115 స్థానాలు దక్కుతాయని వెల్లడించారు.
పైగా, తమ పార్టీ అధికారికంగా చేయించుకున్న అంతర్గత సర్వేలోనే ఈ విషయం వెల్లడైందని తేల్చి చెప్పారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, డిసెంబరులో శాసనసభను రద్దు చేస్తే.. మార్చి- ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగొచ్చని కూడా రఘురామ పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను మార్చుతానని తమ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటున్నారని పేర్కొంటూ వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్యెల్యేలలో దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు టికెట్ అడిగే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఖర్చులు ఇస్తానంటే తప్ప అభ్యర్థులు దొరకరని ఎద్దేవా చేశారు.
మరోవైపు.. ఏపీలో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ చంద్రబాబు ఇప్పటికే తన వ్యుహాలను అమలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దమనే సంకేతాలు పంపుతున్నది.
కాగా, ఇప్పటికే చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లా పర్యటన, మహానాడు విజయవంతంగా జరపడం ద్వారా టిడిపి శ్రేణులలో మంచి జోష్ నింపారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చంద్రబాబు క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టత, నియోజకవర్గాల ఇన్చార్జ్ల పనితీరుపై దృష్టి సారించారని, వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆయనకు కూడా తలనొప్పిగా తయారయ్యాయి. హెచ్చరికలతో ప్రయోజనం కనిపించడం లేదు.