జాతీయ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం కోసం ఓ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను దేశంలో ఎవ్వరు అంత సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై ఎవరూ కనీసం ఎటువంటి వాఖ్య కూడా చేయలేదు. అయితే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆయనను ఆదివారం కలవడం ఆసక్తి కలిగిస్తోంది.
జాతీయ పార్టీ ఏర్పాటు గురించి కేసీఆర్ సంకేతం ఇచ్చిన తర్వాత బహుశా ఆయనను కలసిన టి ఆర్ ఎస్ తో సంబంధం లేని నేత ఆయనే కావడం గమనార్హం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా, ఆయన మద్దతుతో రెండు సార్లు రాజమహేంద్రవరం నుండి లోక్ సభకు ఎన్నికైన తర్వాత, ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్ధకంగా ఉండడంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
మరోవంక, రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ ప్రారంభించి, ఏపీలో అధికారంలోకి వచ్చినా ఆయనతో ఉండవల్లికి మంచి సంబంధాలు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం రాజకీయంగా ఎటువంటి వేదిక లేకుండా ఉన్న ఉండవల్లి కేసీఆర్ ప్రారంభించబోయే పార్టీ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
నేరుగా ప్రజలతో చెప్పుకోదగిన సంబంధాలు లేకపోయినా కేసీఆర్ వలే విషయాలను వ్యక్తం చేయడంలో తార్కికంగా ఆకట్టుకునే స్వభావం ఉండడంతో కేసీఆర్ దగ్గరకు చేర్చినట్లు కనిపిస్తున్నది. ఈ దృష్ట్యా ఆయన ఆ పార్టీలో చేరి, కీలక భూమిక నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే కధనాలు వెలువడుతున్నాయి.
వీరు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్ ఫ్రంట్తోపాటు, మమతా బెనర్జీ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ ఫ్రంటల నేపథ్యం వంటి అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమక్షంలో వీరిద్దరూ సమాలోచనలు జరపడం గమనార్హం.
కొత్త పార్టీ ఏర్పాటు, విస్తరణ అవకాశాల గురించి ప్రధానంగా చర్చించినట్లు కనిపిస్తున్నది. అందుకోసం దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్యం, అన్యాయం ప్రదర్శిస్తున్నారని ద్రావిడ పార్టీల వాదనలను ప్రజలలోకి తీసుకెళ్లడంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్లు చెబుతున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరికంటా వ్యతిరేకిస్తూ వస్తున్న ఉండవల్లి, పార్లమెంట్ లో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. లోక్ సభ తలుపులు మూయించి, కనీసం చర్చకు అవకాశం లేకుండా, సభా నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా విభజన బిల్లును ఆమోదించడం రాజ్యాంగ బద్దం కాదని అంటూ ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా విభజన తీరుతెన్నులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అటువంటి నేతతో కేసీఆర్ సమాలోచనలు జరపడం తెలంగాణ సమాజంకు ఎటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుందని టి ఆర్ ఎస్ వర్గాల్లో ఈ సందర్భంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.