ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రసార హక్కుల వేలం పాట ద్వారా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)కి రూ.48,390 కోట్ల ఆదాయం లభించనుంది. ఇదే సమయంలో ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్ గా ఐపిఎల్ నిలిచింది. మూడు రోజుల పాట కొనసాగిన ఈ వేలం పాటలో ఈసారి కూడా టివి ప్రసార హక్కులను డిస్నీ స్టార్ (స్టార్ నెట్వర్క్) సొంతం చేసుకుంది.
సోమవారం రెండో రోజు వేలం పాట ముగిసే సమయానికి సోనీ నెట్వర్క్ ముందంజలో నిలిచింది. అయితే మంగళవారం చివరి రోజు అనూహ్యంగా స్టార్ నెట్వర్క్ టివి ప్రసార హక్కులను దక్కించుకుంది.
ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్‌లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్వర్క్ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది.
2023-27 కాలానికి గాను టివి రైట్స్ కోసం స్టార్ నెట్వర్క్ భారత క్రికెట్ బోర్డుకు రికార్డు స్థాయిలో రూ.23,575 కోట్ల చెల్లించనుంది. గతంలో కూడా స్టార్ నెట్ వర్క్‌కే ఐపిఎల్ టివి ప్రసార హక్కులు దక్కాయి. ఇక డిజిటిల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్18 సొంతం చేసుకుంది. రానున్న ఐదేళ్ల వ్యవధి కోసం వయాకామ్ సంస్థ రూ.20,500 కోట్లను బిసిసిఐకి చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు విదేశాల్లో ప్రసారాలకు సంబంధించిన మీడియా హక్కులను రిలయన్స్ వయాకామ్టైమ్స్ ఇంటర్నెట్లు సంయుక్తంగా దక్కించుకున్నాయి. దీని కోసం రెండు సంస్థలు కలిసి బిసిసిఐకి రూ.3,273 కోట్లు చెల్లించనున్నాయి. ఐపిఎల్ మీడియా రైట్స్‌కు సంబంధించిన వివరాలను భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా మీడియాకు వెల్లడించారు.