వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా నేతృత్వంలో 2023 నుంచి మహిళల ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహణకు కార్యాచరణ సిద్ధమవుతోంది. బుధవారం జరిగిన బీసీసీఐ సమావేశం అనంతరం జై షా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
దేశీయంగా క్రికెట్‌ను మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే 2023 నుంచి మహిళల ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఇకపై కేవలం ఐపీఎల్ కోసం అన్ని క్రికెట్ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్‌ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపిందని బీసీసీఐ వెల్లడించింది.
ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్లో ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. మీడియా హక్కుల వేలం ద్వారా భారీ ఆదాయం రావడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హర్సం వ్యక్తం చేశారు. క్రికెట్ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది ప్రతిభకు సంబంధించినది అని పేర్కొన్నారు.
యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది మంచి ప్రేరణ ఇస్తుందని, తద్వారా భారత జట్టుకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి, టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించారు.