కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ ఇప్పటికీ కరోనా అనంతర రుగ్మతలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే ఈ వ్యాధితో పదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. ఈ అక్యూట్ హెపటైటిస్‌కు సంబంధించిన మొదటి కేసు బ్రిటన్‌లో బయటపడింది. ఈ ప్రమాదకర కాలేయ వ్యాధికి కారణం అంతుచిక్కడం లేదు. సాధారణంగా హెపటైటిస్‌కు హెపటైటిస్- ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు వైరస్లు కారణమవుతాయి.
కానీ ఈ అక్యూట్ హెపటైటిస్ కేసుల్లో ఈ వైరస్లు కనిపించలేదు. దీంతో ఇది పోస్ట్ కొవిడ్ లక్షణమని పరిశోధకులు తేల్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కరోనా నుండి కోలుకున్న ఐదుగురు చిన్నారులపై అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనా ఫలితాలు జర్నల్ ఆఫ్ పిడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయి.
ఐదుగురు చిన్నారులపై రెండు రకాల క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఇందులో 3,5 నెలల వయస్సు గల ఇద్దరు చిన్నారులు తీవ్రమైన కాలేయ సంబంధ వ్యాధి (అక్యూట్ హెపటైటిస్)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. కరోనాకు ముందు వీరిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, తర్వాత ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పరిశోకులు చెప్పారు.
ప్రస్తుతం వీళ్లకు కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరముందని అన్నారు. మిగిలిన ముగ్గురు చిన్నారుల్లో 8, 13 ఏళ్ల వయస్సుగల ఇద్దరు కొలెస్టాసిస్ హెపటైటిస్ అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. వారికి స్టెరాయిడ్స్ ఇవ్వగా కాలేయ ఎంజైమ్స్ మెరుగుపడ్డాయని పరిశోధకులు తెలిపారు.