‘అగ్నిపథ్‘ నిరసనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడుకుపోయే విధంగా ముందుగానే ఓ ‘రైల్వే స్టేషన్ బ్లాక్ ‘పేరుతో వాట్సాప్‌లో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి.. సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు పోలీస్ విచారణలో వెల్లడైనది. గురువారం రాత్రే సుమారు 500 మంది నిరసనకారులు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
రైళ్లను ఆపేసి ఆందోళన వ్యక్తం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తొలుత స్టేషన్ బయట ఆందోళనలు చేపట్టిన యువత.. బస్సు అద్దాలు పగుల గొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం స్టేషన్లోకి చొచ్చుకు వచ్చిన యువత అక్కడ విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది.
ప్లాట్‌ఫాంలపై స్టాళ్లను పగులగొట్టడం, అక్కడే నిలిపి ఉంచిన రైళ్ల అద్దాలు పగుల కొట్టడం వంటి చర్యలకు దిగారు. రైల్వే పార్శిల్స్ విభాగం వద్ద ఉన్న సంచులను పట్టాలపై వేసి తగులబెట్టారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో హింస చెలరేగింది.
వీరిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జ్, భాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళనలు సద్దుమణగకపోవడంతో గాల్లోకి రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు.ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మృతి చెందారు.
వీరితో పాటు ఖమ్మంకు చెందిన నాగేందర్ బాబు(21), వక్కరి వినరు(20), కర్నూల్ మంత్రాలయానికి చెందిన రంగస్వామి(20), కరీంనగర్ చింతకుంట గ్రామానికి చెందిన రాకేష్(20), శ్రీకాంత్ (మహబూబ్‌నగర్, పాలకొండ విల్), కుమార్(21) వరంగల్, పరశురాం(22) నిజాంసాగర్ కామారెడ్డి జిల్లా గాయపడ్డారు. వీరంతా 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. రైళ్లు రద్దయిన విషయం తెలియక ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికులను స్టేషన్లోకి అనుమతించకపోవడంతో వారంతా రోడ్డపైనే పడిగాపులు కాసారు.
కాగా, రైల్వే డీజీ సందీప్ శాండిల్య స్వయంగా రంగంలోకి దిగి శుక్రవారం సాయంత్రంకు రైల్వే ట్రాక్ మొత్తాన్ని క్లియర్ చేశారు. రైల్వే స్టేషన్ మొత్తం తమ ఆధీనంలో వుందని అడిషనల్ కమీషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఆందోళన చేస్తున్న వారందరినీ బయటకు పంపివేశామని ఆయన పేర్కొన్నారు. పట్టాలపై వున్న వారందరీని క్లియర్ చేశామని శ్రీనివాస్ వెల్లడించారు.
రిక్రూట్మెంట్ ర్యాలీ సమయంలో కలిసినప్పుడు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపుల్లో దీనిపై ప్రచారం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ వద్ద నిరసన చేపడదామని నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపుల వేదికగా.. జస్టిస్ ఫర్ ఆర్మీ సీఈఈ, హకింపే ట్ ఆర్మీ సోల్జర్ పేరుతో ఉన్న గ్రూపుల్లో ఏం చేయాలో మాట్లాడుకున్నారు. వాట్సాప్‌లోనే విధ్వంసానికి ప్లాన్ చేసుకున్నారు.
పెట్రోల్ బాటిల్స్, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలని ఆడియో సంభాషణలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు.. వాట్సాప్ గ్రూప్ ఆర్గనైజర్స్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇక, సోషల్ మీడియా వేదికగా(ఇన్స్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్)లో మేసేజ్‌లు పంపుకున్నట్టు పోలీసులు తెలిపారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ నుండి వచ్చిన 300 మంది ఆందోళనకారులు స్టేషన్‌కు చేరుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, హైదరాబాద్ కమిషనర్ సైతం కుట్రకోణంపై దర్యాప్తునకు ఆదేశించారు.
బిహార్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్.. మొత్తం 7 రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు శుక్రవారం తీవ్రమయ్యాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. యువత ఆగ్రహ జ్వాలల్లో రైళ్లు, రైల్వే ఆస్తులు ఆహుతవుతున్నాయి. 200కిపైగా రైళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఏడు రైళ్ల బోగీలకు నిప్పుబెట్టారు.