గూఢచర్యం కేసులో విచారణ కోసం వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను అమెరికాకు అప్పగించడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ సంతకాలు చేశారు.
బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పై కోర్టులో అసాంజె అప్పీల్ చేయనున్నారని వికీలీక్స్ ప్రకటించింది. అసాంజె దీనిపై అప్పీల్ చేయాల్సి వుంటుంది. అసాంజెను అమెరికాకు అప్పగించవచ్చని ఏప్రిల్‌లో బ్రిటీష్ కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది.
ఆనాడు అసాంజె అప్పగింతను ఆమోదిస్తూ బ్రిటీష్ న్యాయమూర్తి, తుది నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలివేశారు. ”పోరాడేందుకు ఈ రోజు ఆఖరు కాదు, కొత్త చట్టపరమైన పోరాటానికి ఇదొక ప్రారంభం మాత్రమే. చట్టపరంగానే అప్పీల్ చేస్తాం.” అని వికీలీక్స్ ట్విట్టర్లో పేర్కొంది.
అసాంజెను అమెరికాకు అప్పగించడం అణచివేత చర్యగా, అన్యాయమైనదిగా, అప్పగింత క్రమాన్ని దుర్వినియోగం చేసేదిగా బ్రిటన్ కోర్టులు భావించడం లేదని హోం శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అసాంజెను అప్పగించడం ఆయన మానవ హక్కులకు, సక్రమమైన విచారణను ఎదుర్కొనేందుకు గల హక్కుకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధంగా వుంటుందని తాము భావించడం లేదని పేర్కొంది.
అమెరికాలో కూడా ఆయన పట్ల సముచితంగానే వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే, అమెరికాలో విచారణను అడ్డుకునేందుకు ఏళ్ల తరబడి అసాంజె జరుపుతున్న పోరాటంలో ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
గూఢచర్యానికి సంబంధించి అసాంజెపై 17 అభియోగాలు నమోదయ్యాయి. వాటిపై ఆయనను విచారించాలని అమెరికా భావిస్తోంది. అందుకుగానూ అసాంజె అప్పగింతను కోరుతోంది. ఒకవేళ అసాంజెపై అభియోగాలు రుజువైతే 175 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం వుంది. అసాంజే అప్పగింత అభ్యర్ధనను తిరస్కరించాల్సిందిగా జర్నలిస్టు సంఘాలు, మానవ హక్కుల గ్రూపులు బ్రిటన్‌కు విజ్ఞప్తి చేశాయి.