గో సంరక్షకులను, కశ్మీర్ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయి పల్లవి వివరణ ఇచ్చుకున్నారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో సందేశాన్ని ఉంచుతూ తన మాటల్లో అసలు ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వక్రీకరణలు చేసి కొంతమంది తనను దోషిగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మాటల వల్ల ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని ఆమె కోరారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతూ తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు.
‘గత కొన్నిరోజులుగా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయాన్ని చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. మళ్లీ నా మాటలు వర్గీకరించవచ్చు. ఇంటర్వ్యూలో నన్ను మీరు లెఫ్ట్ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్ వింగ్‌కా? అని అడిగారు” అని ఆమె పేర్కొన్నారు.
“నేను దేనికి మద్దతు ఇవ్వడం లేదు అని స్పష్టంగా చెప్పాను. ఆ ఇంటర్వ్యూను ముక్కలు ముక్కలుగా చేసి వైరల్ చేశారు. మనం ముందు మంచి మనుషులుగా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం” అని ఆమె స్పష్టం చేశారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూశాక తాను చాలా బాధపడ్డానని, అదే విషయాన్ని చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో పంచుకున్నానని ఆమె తెలిపారు.
అక్కడి ప్రజలు వలస వెళ్లడం చూసి చాలా డిస్ట్రబ్ అయ్యాను అని ఆయనతో చెప్పానని అంటూ అలాగే కరోనా సమయంలో ఒక గుంపు గో రక్షణ పేరుతో ఓ వ్యక్తిపైన దాడి చేసిన ఘటన కూడా తనను కదిలించిందని ఆమె చెప్పారు.
“నా దృష్టిలో హింస ఏ రూపంలో ఉన్నా తప్పే. ఏ మతం పేరుతో జరిగినా అది పాపమే. ఒక వైద్యురాలిగా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదే” అంటూ ఆమె తన నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ మధ్యనే విడుదలైన ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశానని చెప్పిన పల్లవి.. పశువులను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్‌పై దాడి చేయడాన్ని ప్రశ్నించారు. సామూహిక నరమేధాన్ని, వ్యక్తిగత హింసాయుత చర్యను ఒకే ఘాటిన ఏవిధంగా కట్టివేస్తారంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు.
విరాటపర్వం సినిమాపై ఫిర్యాదు
,మరోవంక, విరాటపర్వం అనే సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై శ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఈ సినిమా బ్యాన్ చేయాలని కోరుతూ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. విరాట పర్వం సినిమా శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో చాలావరకు అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నందున సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని కోరారు.