తన నియోజకవర్గంలోని భీమవరంలో వచ్చేనెల ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో తనను పాల్గొననీయకుండా చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు .ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారన్న ఆయన, తన సహచర ఎంపీలు ఎంతమంది తనని రాష్ట్రానికి వెళ్లవద్దని సూచించాని పేర్కొన్నారు.
“నా నియోజకవర్గానికి నేను వెళ్తానంటే, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి” అంటూ ప్రశ్నిచారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యులకు ఏపీ పోలీసులు రఘు రామ రాష్ట్రానికి వస్తే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్టు చేయవలసి వస్తుందని చెప్పారన్నారని విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు చేస్తున్న దారుణాలను, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేయాలనుకుంటున్న దురాగతాలను ప్రధానమంత్రి కార్యాలయ దృష్టికి, హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతాని స్పష్టం చేశారు.
విశాఖలో లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలో 30 మంది సభ్యులతో సమావేశం కావాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని కమిటీ సభ్యులు, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లగా కమిటీలో రఘురామకృష్ణంరాజు ఉంటే సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తన సహచర సభ్యులు తనతో చెప్పారని చెప్పారు.
ఒకవేళ ఆయన వస్తే కచ్చితంగా అరెస్టు చేస్తామని, ఆ తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుందని హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారని తెలిపారు. దీనితో కమిటీ సభ్యులు రాష్ట్ర పోలీసుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తూ, తమ కమిటీ పర్యటనలో భాగంగా కోల్ కత్తా లో సమావేశం కావాల్సి ఉండగా తనని అక్కడకు రావాలని సభ్యులు కోరారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఈ విషయాన్ని తాను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.
ఒక ఎంపీ రాసిన లేఖకు ఐపీఎస్ అధికారి అయిన డీజీపీ సమాధానం చెప్పకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పోలీసుల ఉన్మాద చర్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతునని చెప్పారు. తనపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల్లో స్టే ఆర్డర్ లు ఉన్నాయని చెబుతూ ఇంకా ఎన్ని కేసులు పెట్టుకున్నా వాటన్నిటిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
మన ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తన గ్రామంలో తన ఇంటికి కూతవేటు దూరంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి లోక్ సభ నాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అవుతుంటే, స్థానిక లోక్ సభ సభ్యుడిగా తాను హాజరు కావడం ప్రోటోకాల్ అని చెప్పారు.
32 కేసుల్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళవచ్చు కానీ, తాను మాత్రం తన నియోజకవర్గానికి వెల్లావద్దా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.