టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇవాళ బీసీసీఐ ట్వీట్ చేసింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది.
“శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ తేలింది. అతడు ప్రస్తుతం ఐషోలేషన్లో ఉన్నాడు. అదే విధంగా అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని” బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది.
కాగా, జూలై 1 నుంచి ఇంగ్లాడ్ తో టెస్టు క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టెస్టుకు ముందే రోహిత్ కు పాజిటివ్ రావడం టీమిండియాకు భారీ షాక్ అనే చెప్పొచ్చు. రోహిత్ వారం రోజులు పాటు ఐషోలేషన్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై1న జరగబోయే నిర్ణయాత్మక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
రోహిత్ శర్మ ప్రస్తుతం టీసెస్టర్ జట్టుతో జరుగుతోన్న వార్మప్ మ్యాచ్ లో ఆడుతున్నాడు. గురువారం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆయన 25 పరుగులు చేశాడు. శనివారం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయలేదు. రోహిత్ కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది.
ఇలా ఉండగా, భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు నిన్న 15,940వేలు నమోదు కాగా..కొత్తగా 11,739పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 మంది మృతిచెందగా, 10,917 మంది డిశ్చార్జీ అయ్యారు.
మొత్తం కేసుల్లో 0.21 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 197 కోట్లు దాటింది. శనివారం ఒక్కరోజే 11 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశారు.