జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను నిర్వహించారు పోలీసులు. బాధితురాలిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లగా..న్యాయమూర్తి సమక్షంలో బాధితురాలు నిందితుడు సాదుద్దీన్ ను గుర్తుపట్టింది.
ఆ తర్వాత సైదాబాద్ లోని జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను బాధితురాలు గుర్తించింది. జైల్లో ఉన్న ఇతర ఖైదీల మధ్య అత్యాచార నిందితులను ఉంచగా..బాధితురాలు వారిని గుర్తించింది. బాధితురాలు చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.
మరోవంక, ఆరుగురు నిందితుల డీఎన్ఏ సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఐదుగురు మైనర్లతోపాటు ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ డీఎన్ఏ సేకరణకు జువైనల్ బోర్డుతోపాటు కోర్టు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అనుమతించింది. ఒకటి రెండు రోజుల్లో నిందితుల నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్‌కు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇన్నోవా కారులో సేకరించిన ఆధారాలన్నింటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టు కూడా పోలీసుల చేతికి వచ్చింది.
ఈ కేసులో ఇంకా బలమైన ఆధారాలు ఉండాలని పోలీసులు భావిస్తున్నారు. డీఎన్ఏ టెస్టు చేసి.. ఆ రిపోర్టును కూడా చార్జ్ షీటులో పొందుపరిచేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు.