కొత్త కొత్త పంథాలలో సైబర్ నేరగాళ్లు జనాలకు వల విసురుతున్నారు. కేవలం సామన్యులకే కాదు రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖులకు సైబర్ నేరగాళ్లతో సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఇలా చాలామందికి వాట్సాప్ లో టోకరా ఇచ్చిన కేటుగాళ్లు.. ఈ సారి ఏకంగా తెలంగాణ డీజీపీ పేరు, ఫొటో కూడా వాడుకున్నారు.
97857 43029 అనే ఫోన్ నంబరుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టిన కేటుగాళ్లు కొందరిని డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులులు కూడా ఉన్నారట. సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో మెసేజ్‌లు వెళ్లినట్లు తెలుస్తోంది.
డీజీపీ ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్‌లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై సైబర్ క్రైం విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి ఫేక్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దని ప్రజలకు సూచించింది. కాగా, ఈ మెసేజ్ ల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.
డీజీపీ ఆదేశాలతో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీజీపీ మహేందర్‌రెడ్డి పేరుతో ఫేస్బుక్, ట్విటర్, తదితర సోషల్ మీడియా ఖాతాలున్నాయి. అందులో పోలీసు శాఖకు సంబంధించిన విషయాలను ఆయన పోస్టు చేస్తుంటారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోను డౌన్లోడ్ చేసుకుని.. ఒక వాట్సాప్ నంబర్‌కు డీపీగా సైబర్ నేరగాళ్లు పెట్టారు. అలాగే, పోలీసు శాఖకు చెందిన వెబ్సైట్లలో ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లను సేకరించి సందేశాలు పంపించారు.
వెంటనే ఈ విషయంపై అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆ నంబరును వెంటనే బ్లాక్ చేయించారు. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ నంబర్ తీసుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డిజిపి పేరిట మోసాలకు యత్నించిన ముఠా గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీసులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఫేక్ సిమ్ కార్డులు, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్‌తో మోసాలు చేస్తున్నారు. గతేడాది అడిషనల్ డీజీ స్వాతి లక్రా, అప్పటి నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్ సహా రాష్ట్రవ్యాప్తంగా 60 మందికి పైగా పోలీసు ఆఫీసర్ల ఫొటోలతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్‌లోని కాంటాక్స్ట్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.
ఇలా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారికి ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్‌లో మెసేజ్‌లు చేశారు. అధికారి హోదాను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేశారు. వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్స్ పేరుతో కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఉన్నతాధికారుల డీపీ ఉండడంతో సైబర్ నేరగాళ్లు ఇచ్చిన గూగుల్ పే అకౌంట్స్‌కు అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇలాంటి కేసుల్లో ఎవరైనా చెబితే తప్ప ఫేక్ అకౌంట్స్ గుర్తించలేకపోవడం గమనార్హం.
పోలీసులకు సవాల్‌గా మారిన ఫేక్ డీపీలపై సైబర్ ఎక్స్పర్ట్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఫోన్ నంబర్స్, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా రాజస్థాన్, యూపీ, ఒడిశాకు చెందిన 28 మందిని గతేడాది అరెస్ట్ చేశారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల నుంచి సవాళ్లు తప్పట్లేదు. ఏకంగా డీజీపీ పేరుతో అకౌంట్ క్రియేట్ చేయడంతో సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజలను అలర్ట్ చేస్తూనే సైబర్ నేరగాళ్ల కోసం సెర్చ్ చేస్తున్నారు.
ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తమ పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. తమ అకౌంట్లలో యూనిఫాంతో, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉన్న ఫొటోలకు ప్రైవసీ సెట్టింగ్స్ చేస్తున్నారు. ఫొటో డీపీలతో వచ్చే పోస్టింగ్స్‌ను యాక్సెప్ట్ చెయ్యొద్దని తమ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ట్యాగ్ చేస్తున్నారు.