ఆంధ్ర ప్రదేశ్ లో తయారయ్యే మద్యంలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. మద్యం ఎవరు తయారు చేస్తున్నారో చెప్పమంటే చెప్పరని, చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చారని అంటున్నారని, అయితే ఏపీలో ఉన్న బ్రాండ్స్ ఇతర రాష్టాలలో ఎక్కడ లేవని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
పాత బ్రాండ్స్ ఇప్పుడు ఒక్కటి కూడా దొరకడం లేదని, కొత్త కొత్త బ్రాండ్స్ మార్కెట్లోకి వస్తున్నాయని చెబుతూ జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెనలాగా ఇప్పుడు మద్యం నిషేధం పధకానికి జగనన్న వితంతు దీవెన అని పేరు పెట్టాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. మద్యాన్ని ఇంతకు ముందు బేవరైజేస్ కార్పొరేషన్ తయారు చేసేదని గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు, 20 మద్యం కంపెనీల నుంచి బ్రాండ్స్ కొంటున్నామని అధికారులు అంటున్నారని అంటూ దొంగ స్కీమ్స్ పెట్టి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పాత బ్రాండ్స్ ఎందుకు దొరకడం లేదు? దీనికి సమాధానం చెప్పాలని రఘురామ సవాల్ చేశారు.
కాగా, తనను సంసద్ టీవీ ఇంటర్వ్యూకు పిలవద్దని వైసిపి ఎంపీ విజయ సాయిరెడ్డి లేఖ రాశారని పేర్కొంటూ సంసద్ టీవీకి, పార్టీలకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సంసద్ టీవీలో తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతానని, వేరేవారి గురించి తాను చెప్పనని పేర్కొన్నారు. ఈ మేరకు సంసద్ టీవీ సీఈవోకి లేఖ రాసినట్లు చెప్పారు. తనను పార్టీ నుంచి బహిష్కరించకుండా చర్చల్లో అనుమతించొద్దంటూ లేఖలు రాయలేరని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. సాయిరెడ్డి లేఖ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని విమర్శించారు.