పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం తీవ్రమైంది. ఈ ప్రభావం అక్కడి టెలికం రంగంపై చూపిస్తోంది. ఈ విద్యుత్ కోతలతో చేతులెత్తేసిన టెలికం ఆపరేటర్లు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు
‘దేశ వ్యాప్తంగా ఎక్కువ సేపు విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నందుకు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తాం’ అని టెలికం ఆపరేటర్లు హెచ్చరించారు. ఈ విద్యుత్ కోతల కటకట వల్ల వారి కార్యకలాపాలకు సమస్యలు, ఆటంకాలు ఎదురౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారుని నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్బిటి) ట్విట్టర్లో పేర్కొంది.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, జూలై నుంచి లోడ్ షెడ్డింగ్ పెరుగుతుందని హెచ్చరించారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అవసరమైన పరిమాణంలో సరఫరాకావడం లేదని తెలిపారు. దీని కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల పని గంటలను తగ్గించింది. వారానికి ఆరు రోజులకు బదులుగా ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. గత ఏప్రిల్ లో అధికారంలోకి వచ్చిన షరీఫ్ ఉత్పాదికత పెంచడం కోసం అంటూ ప్రభుత్వ కార్యాలయాలు ఐదు రోజులకు బదులుగా ఆరు రోజులు పనిచేయాలని ఆదేశించారు.
మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు ఇచ్చే ఇంధనం బాధ్యలను 40 శాతం తగ్గించారు. షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలను త్వరగా మూసేయాలని ఆదేశించింది. జూన్లో పెరిగిన ఉష్ణోగ్రతలతో విద్యుత్ వాడకం పెరగడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం నేచురల్ గ్యాస్ కొనుగోలుకు పాక్ యత్నిస్తుందని మీడియా తెలిపింది. దానితో గత నెలరోజులుగా పట్టణ ప్రాంతాలలో 4 నుండి 6 గంటల సేపు, గ్రామీణ ప్రాంతాలలో 8 గంటల మేరకు విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు.