బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం మధయ్న్నాం హైదరాబాద్ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రి తలసాని ఇప్పటివరకు ప్రధానికి రెండుసార్లు స్వాగతం పలికారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది. సిర్పూర్ కాగజ్నగర్, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంతాల నుంచి ఇవి రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ విమానాశ్రయంలో దిగడానికి కొన్ని గంటల ముందు బేగంపేట విమానాశ్రయంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వాగతం పలకనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంలో సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం ఆరు నెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.
అంతకుముందు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో 20వ వార్షిక వేడుకలకు హాజరయ్యేందుకు ప్రధాని రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు ఆ సమయంలో కేసీఆర్ బెంగళూరుకు వెళ్లారు. అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున మోదీకి తలసానినే స్వాగతం పలికారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ముచ్చింతల్లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ సందర్భంగా మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికలేదు. జ్వరం కారణంగా కేసీఆర్, మోడీకి స్వాగతం పలికేందుకు వెళ్లలేదని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.