ప్రపంచవ్యాప్తంగా రానున్న 10 ఏళ్లలో కోటి మందికి పైగా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు ‘ది లాన్సెట్’ జర్నల్ వెల్లడించింది. కరోనా తర్వాత ఈ పరిస్థితులు రావడం గమనార్హం. విద్యా వ్యవస్థలో ఏర్పడ్డ మార్పులు, పెరిగిపోతున్న పేదరికమే అందుకు ప్రధాన కారణమని లాన్సెట్ తన ఎడిటోరియల్‌లో అభిప్రాయ పడింది.
‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది. ఇది వారి ఆరోగ్యం, బాగోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాల్య వివాహాల వల్ల యుక్తవయస్సులో గర్భధారణ, అనారోగ్యం బారిన పడటం, భర్త చేతిలో హింసకు గురవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి’ అని తెలిపింది.
కరోనా మహమ్మారి రాకతో ప్రపంచవ్యాప్తంగా సమస్య మరింత జటిలమైందని పేర్కొంటూ పేదరికం పెరిగి, చదువు చట్టుబండలైందని ఆ ఫలితంగానే రానున్న దశాబ్ద కాలంలో కోటి మంది బాలికలకు బాల్య వివాహాలు జరగనున్నాయని పేర్కొంది.
ఏటా 1.2 కోట్ల మంది బాల్యంలోనే వివాహ వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారని, నార్త్‌వెస్ట్ సెంట్రల్ ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ అమెరికాల్లో ఈ వివాహాలు ఎక్కువని పేర్కొంది. నైగర్‌లో 76 శాతం మంది, బంగ్లాదేశ్‌లో 59 శాతం మంది, బ్రెజిల్లో 36 శాతం మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయని తెలిపింది.
ఇదిలా ఉంటే ఆర్థికంగా అగ్ర భాగాన ఉన్న అమెరికాలో సైతం 18 ఏళ్ల కాలంలో (2000-18) దాదాపు 3 లక్షల బాల్య వివాహాలు జరిగాయని లాన్సెట్ వెల్లడించడం గమనార్హం. అయితే వీటిని అరికట్టాలంటే వివాహ వయస్సు పెంచడమే పరిష్కారం కాదని తెలిపింది. ఆడ పిల్లలకు నగదు, ఇతర ప్రోత్సాహాలను అందిస్తూ.. చదువుపై దృష్టి సారించేలా చేయాలని పేర్కొంది.
వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా కార్మిక విపణిని విస్తరించాలని, జీవనోపాధి పొందే నైపుణ్యాలు నేర్పాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చదువు, ఆర్థిక సాధికారత, నచ్చిన వ్యక్తిని ఎంచుకొనే స్వేచ్ఛ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలో నిర్ణయించుకొనే హక్కు వారికి ఇవ్వాలని ‘ది లాన్సెట్’ పేర్కొంది.