సుమారు పది రోజుల పాటు నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. సంఖ్యాబలం దృష్ట్యా ఆయన బలపరీక్షలో నెగ్గడం పట్ల ఎవ్వరికీ అనుమానాలు లేవు.
అయితే, అంతటితే ఆయనకు సమస్యలు తీరే అవకాశాలు కనిపించడం లేదు. మరో వారం రోజుల తర్వాత సుప్రీం కోర్టులో జరిగే పరిణామాలను బట్టి ఆయన రాజకీయ భవిష్యత్ నిర్ణయమయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి నోటీసు పంపడం దీనికి ప్రధాన కారణం.
శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు కూడా ఈ ఎమ్మెల్యేలను సోమవారం జరిగే బలపరీక్షలో ఓటు వేయకుండా నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లను జూలై 11న విచారిస్తామని కోర్ట్ స్పష్టం చేసింది. విప్ జారీ చేసినా పార్టీ సమావేశానికి హాజరు కాలేదని డిప్యూటీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.
ఏక్నాథ్ షిండే స్పందిస్తూ, విప్‌ను అసెంబ్లీలో వర్తింపజేయవచ్చు, సమావేశాలలో కాదని పేర్కొన్నారు. తదుపరి విచారణను జూలై 11వ తేదీకి ఖరారు చేసిన కోర్టు, నోటీసుపై స్పందించేందుకు రెబల్ ఎమ్మెల్యేలకు జూలై 12 వరకు గడువు ఇచ్చింది.తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు ఓటు వేయకుండా నిషేధించాలని ప్రభు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జూలై 11న ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొంది.
శివసేన అధ్యక్షునిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనందున అది నిజమైన శివసేన అని ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నది. ఐతే పార్టీకి చెందిన 55 మందిఎమ్మెల్యేలలో 40 మంది మద్దతు ఉన్నందున తమదే నిజమైన శివసేన అని ఏక్నాథ్ షిండే వర్గం స్పష్టం చేస్తున్నది. పిటిషనర్ ఆందోళనలపై స్పందిస్తూ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని కోర్టు తెలపడం గమనార్హం.
మరోవంక ఆదివారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. రాజకీయ సంక్షోభం మధ్య ఎన్నికల నిర్వహణకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏడాదిన్నరగా ఈ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ కోర్టులో వివాదం పరిశీలనలో ఉన్నందనే సాకుతో స్పీకర్ ఎన్నికకు అనుమతి ఇవ్వకుండా వస్తున్న గవర్నర్ ఇప్పుడు అనూహ్యంగా షిండే ప్రభుత్వంకు అనుమతి ఇవ్వడం మరో వివాదం అంశంగా మారింది.
“ఆదివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాల్సిన ఆవశ్యకత మాకు అర్థం కావడం లేదు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మేము (ఎంవిఎ) ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఈ విషయం కోర్టులో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని గవర్నర్ మాకు నెలల తరబడి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఎలా అనుమతి ఇచ్చారు?” అని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ ప్రశ్నించారు.
ఈ రెండు కేసుల్లోనూ కోర్టు తీర్పు తిరుగుబాటుదారులకు అనుకూలంగా రాకుంటే షిండే ప్రభుత్వం పెను ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. తాము బీజేపీలో విలీనం కాబోమని ఏక్నాథ్ షిండే చెప్పారు. శివసేన (బాలాసాహెబ్) అనే పేరుతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రత్యేక బ్లాకును ఏర్పాటు చేశారు. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవాలంటే మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు మరో పార్టీలో విలీనం కావాల్సిన అవసరం ఉందని థాకరే వర్గం పేర్కొంటున్నది. చట్టబద్ధంగా, ఒక పార్టీలోనే ప్రత్యేక బ్లాక్‌ని ఏర్పాటు చేయలేరని వారు స్పష్టం చేస్తున్నారు.
జూలై 11న సుప్రీం కోర్టు ఈ చట్టపరమైన వివాదాలను పరిశీలించే అవకాశం ఉంది. తిరుగుబాటుదారుల బ్లాక్‌ను మరో పార్టీలో విలీనం చేయకుండా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తప్పించుకోవడం రాజ్యాంగబద్ధంగా సాధ్యమేనా? అని కోర్టు పరిశీలిస్తుంది. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ముఖ్యమంత్రి, స్పీకర్ ఇద్దరూ పదవులు కోల్పోయే అవకాశం ఉంది.
దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేకు మద్దతిస్తున్నారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే చాలామంది మళ్లీ ఉద్ధవ్ వైపు తిరిగే అవకాశం లేకపోలేదు. థాకరే రాజీనామాకు ముందు, తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న 20 మంది తిరుగుబాటుదారులతో తాను టచ్‌లో ఉన్నట్లు సంజయ్ రౌత్ పేర్కొనడం గమనార్హం.