ఉదయ్ పూర్ తరహాలోనే మరొక వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ మందుల దుకాణ యజమాని ఉమేష్ ప్రహ్లాద్‌రావు కోల్హే గత నెలలో హత్యకు గురయ్యారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత నుపూర్ శర్మ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపినందుకు ఈయనను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. గత నెల 21న రాత్రి పదిగంటలకు ఇంటికి వెళుతున్న ఉమేశ్‌ను మోటార్ బైక్‌పై వచ్చిన కొంత మంది వెంబండించి కత్తులతో దాడి చేసి నరికి చంపేశారు. తొలుత దోపిడీ కేసుగా భావించగా ఇప్పుడు ఉదరుపూర్ ఘటన అనంతరం దీనిపై దృష్టి సారించగా ఉమేష్ పోస్టే కారణమని నిర్ధారించారు.
ఈ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్, ముదస్సిర్ అహ్మద్, షారూక్ పఠాన్, అబ్దుల్ షేక్ తస్లీమ్, షోయమ్ ఖాన్, అతిబ్ రషీద్, యూసఫ్ ఖాన్‌లను అరెస్టు చేశారు. ఉమేష్‌ను చంపితే రూ 10వేలు ఇస్తానని ఇర్ఫాన్ ఇతర నిందితులకు మభ్య పెట్టినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అప్పగించారు.
ఇలా ఉండగా, ఉదయ్ పూర్లో దర్జీ కన్హయ్యలాల్ హత్య కేసులో నిందితులను జైపూర్ కోర్టులో హాజరుపర్చగా 10 రోజుల జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీకి అప్పగించింది. ప్రధాన నిందితులు రియాజ్ అక్తర్, గౌస్ మహ్మద్‌తో పాటు మరో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచిన తర్వాత వాహనం ఎక్కించేందుకు బయటకు తీసుకు రాగా భారీ గుంపు వీరిపై దాడి చేసింది.
జైపూర్‌లోని కోర్టు ఆవరణలో లాయర్లు ఈ దాడికి పాల్పడ్డారు.కోర్టు నుండి నిందితులను బయటకు తీసుకు వెళ్తుండగా న్యాయవాదులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి దిగారు. ”మారో మారో” అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి వారిని తప్పించి పోలీసు వ్యాను ఎక్కించారు.