వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు.
“నన్ను చంపటానికి వచ్చావా?” అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనపై దాడి చేశారని కానిస్టేబుల్ ఫరూక్ ఆరోపించారు. తన కాళ్లు, చేతులు కట్టేయమని తన మనుషులకు చెప్పినట్లు తెలిపారు. కరెంటు షాక్ ఇవ్వాలంటూ తన కుమారుడిని ఆదేశించారని,. తన జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టారని తెలిపారు.
“రఘురామ వెళ్లాక రంగంలోకి దిగిన ఆయన కుమారుడు భరత్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను రెచ్చగొట్టాడు. మా ఇంట్లో తింటూ, నెలనెలా మామూళ్లు తీసుకుంటూ వాడిని చిన్నగా కొడతారేంటంటూ మాట్లాడాడు. భరత్ హెచ్చరికతో పి.ఏ. శాస్త్రి, సీఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు మళ్లీ దాడికి దిగారు. చాలాసేపటి తర్వాత వచ్చిన పోలీసులు నన్ను రక్షించి గచ్చిబౌలి పీఎస్‌కు తీసుకెళ్లారు” అని ఫరూక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురి చేసిన తర్వాత, అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు.
రఘురామరాజుపై నమోదు చేసిన ఈ కేసులో ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రిలతో పాటు సీఆర్పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లనూ నిందితులుగా చేర్చారు. అనుమతి లేకుండా తన ఇంటి వద్ద నిఘా పెట్టారంటూ ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన కానిస్టేబుల్‌ను రఘురామరాజు అనుచరులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.
కాగా, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషాపై ఎంపీ రఘురామ కృష్టంరాజు కుటుంబ సభ్యులు దాడిపై ఏపీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. రఘురామ కృష్ణం రాజు ఇంటి వద్ద ఎలాంటి పోలీసులను పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్ ఐఎస్బీ గేట్ వద్ద స్పాటర్‌గా ఉన్నాడని తెలిపారు.
కానిస్టేబుల్ ఫరూక్ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రఘురామ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఫరూక్ విధుల్లో ఉన్నాడని వెల్లడించారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉన్నాతాధికారులు సస్పెండ్ చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు.
స్టీఫెన్ రవీంద్రపై ఫిర్యాదు
ఇలా ఉండగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనపై చర్య తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రఘురామకృష్ణరాజు లేఖ వ్రాసారు. హైదరాబాద్ లోని తన నివాసం ముందు గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు సోమవారం (జులై 4న) రెక్కీ నిర్వహించారని, వారిని పట్టుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అప్పగించామని లేఖలో తెలిపారు. అయితే.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసు విచారణకు సంబంధించిన విషయాలపై ఎలాంటి సమాచారం ఇప్పటి వరకూ రాలేదని, ఈ విషయం తనకు, తన కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించిన అంశమని లేఖలో పేర్కొన్నారు.
తనపై నిర్వహించిన రెక్కీని ఏపీ రాష్ట్ర క్యాడర్ లోకి తీసుకోవాలనుకున్న ర్ స్టీఫెన్ రవీంద్ర తేలికగా తీసుకున్నారని లేఖలో రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనకు వ్యక్తిగత భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై గచ్చిబౌలి పోలుసులు కేసులు నమోదు చేయాలని చూస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేలా చూడాలని, సీపీ స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.