ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇప్పుడు ద్రవ్యోల్బణం మరో సమస్యగా తయారైంది. ఇప్పటికే ఇంధన కొనుగోళ్లకు అవసరమైన డాలర్లు అయిపోయాయి. ఉద్యోగులకు జీతాలు, ఇతర ప్రభుత్వ ఖర్చుల కోసం కరెన్సీ ముద్రణ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం భారీగా పెరిగి 60 శాతానికి చేరడంతో దీనిని కట్టడి చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.
ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశం ఇదే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి నగదును చొప్పించడం ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త కరెన్సీని ముంద్రించడం నిలిపివేయాలనే నిర్ణయాన్ని శ్రీలంక ప్రభుత్వం తీసుకుంది. మరోవైపు దివాలా అంచుకు చేరడంతో బెయిలౌట్ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) శ్రీలంక మధ్య జరుగుతున్న చర్చలు కఠినంగా సాగుతున్నాయి.
మంగళవారం ప్రధాని రణీల్ విక్రమ సింఘే పార్లమెంట్లో మాట్లాడుతూ దేశ ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ చర్చలు స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్స్థాయికి చేరాలన్నా ఆగస్టు వరకు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.
శ్రీలంకలో వినిమయ వస్తువల ధరలు 58 శాతం, రవాణా ధరలు 120 శాతం, ఆహార ధరలు 80 శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికలో శ్రీలంక 588 బిలియన్ రూపాయలను ముద్రించింది. జనవరి 2020 నుంచి చూస్తే శ్రీలంక 2.3 ట్రిలియన్ రూపాయలను ముద్రించినట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.