మంత్రుల తిరుగుబాటుతో ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించడంతో తదుపరి బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ కు అవకాశాలు ఉన్నట్లు మీడియా కధనాలు వెల్లడిస్తున్నాయి. మొదటగా రాజీనామా చేసింది ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ ఆయనే కావడం గమనార్హం.
తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న ఆయన కనుక ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. 42 ఏళ్ల రిషి సునక్‌ను ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్ర వారి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఫలితంగా తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు.
బ్రిటన్ ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి కూడా రాజీనామా చేస్తున్నల్టు బోరిస్ జాన్సస్ గురువారం ప్రకటించారు. . దీంతో కొత్త ప్రధాని ఎంపికకు మార్గం సుగుమం చేసినట్లయింది. ఇటీవల దేశంలో వరుస కుంభకోణాలు బయటపడటంతో సొంత పార్టీకి చెందిన మంత్రులే రాజీనామా చేశారు. సుమారు 59 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో ఆయన ప్రధాని పదవి వీడక తప్పలేదు.
2019లో ప్రజలు అందించిన అఖండ విజయం పట్ల బోరిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. “నా హయాంలో సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. బ్రెగ్జిట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉంది. కొత్త నేత వచ్చే దాకా ఆ స్థానంలో నేనే కొనసాగుతా, కన్జర్వేటివ్ పార్టీ త్వరలో కొత్త నేతను ఎన్నుకుంటుంది” అని ప్రకటించారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని, తాను విజయవంతం కానందున చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచలోనే అత్యుత్తమ పదవిని కోల్పోయినందుకు బాధగా ఉందని చెబుతూ నూతన నాయకుడికి మద్దతునిస్తానని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా రిషి వెలుగులోకి వచ్చారు. ‘డిషీ’ పేరుతో రిషి అందరికీ చిరపరిచితం.
అయితే పలు వివాదాలలో కూడా చిక్కుకున్నారు. ఎటువంటి చేదు అలవాట్లు లేకపోయినప్పటికీ కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు గాను జరిమానాకు గురయ్యారు. తన భార్య నాన్-డోమ్ స్టేటస్, తన అమెరికన్ గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయ సంక్షోభం కాలంలో వెనుకబడ్డాడన్న ముద్ర ఉండడంతో కాస్త తగ్గి ఉన్నాడు. భార్య విదేశాలలో పొందిన ఆదాయంపై పన్ను చెల్లింపలేదని ఇటీవల విమర్శలు ఎదుర్కొన్నారు.
రిషి సునక్ తాతలు పంజాబ్ నుంచి వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు.కాలిఫోర్నియాలో విద్యార్థులుగా ఉన్నప్పుడు వారు ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళిచేసుకున్నారు.