నాగాలాండ్‌లోని తిరు ఊటింగ్ ఏరియాలో గతేడాది డిసెంబరు 4న జరిగిన మిలటరీ ఆపరేషన్‌లో అయాయకులనే సైనిక బలగాలు బలిగొన్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిటి) నిర్ధారించింది. టీమ్ కమాండర్ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పులు, తదనంతరం చేపట్టిన హింసాత్మక చర్యలు, మాఫీ ప్రయత్నాల వల్లనే రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 13 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చి చెప్పింది.
అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కావాలనే నొక్కి పెట్టారని వెల్లడించింది. ఆర్మీ మేజర్ ర్యాంక్ టీమ్ కమాండర్ దాదాపు 50 నిముషాల పాటు ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన అనంతరం ఈ దాడి తప్పుడు మార్గంలో వెళుతోందనే విషయం గ్రహించారు.
అయితే కీలకమైన ఈ సమాచారాన్ని కావాలనే తొక్కి పెట్టి 21 పారా స్పెషల్ ఫోర్సెస్‌లో అత్యంత అధునాతనమైన ఆల్ఫా టీమ్‌కి చెందిన 30మంది ఆర్మీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత మాన్ జిల్లాలో ఆపరేషన్ జరపాల్సిందిగా కూడా తన టీమ్‌కు ఆదేశాలిచ్చారు. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు పౌరులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
దీనిపై ఆరు నెలల పాటు జరిపిన సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. గతేడాది డిసెంబరు 4న తిరు ఊటింగ్ ప్రాంతంలో రెండు కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటి కాల్పుల సంఘటన సాయంత్రం 4.26గంటలకు జరిగింది. అక్కడ పనిచేస్తున్న కూలీలను నాగా తీవ్రవాదులుగా భావించి జవాన్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
ఆనాటి సంఘటనలో బతికి బయటపడిన ఇద్దరు వ్యక్తులు తర్వాత ప్రత్యక్ష సాక్షులుగా మారారు. ఆ తర్వాత కొన్ని గంటలు గడచిన తర్వాత దాదాపు రాత్రి 9.55 సమయంలో రెండో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఏడుగురు గ్రామస్తులు మరణించారు.
ఇందులో మొదటి సంఘటన ప్రణాళిక ప్రకారం జరిపిన దాడిలో భాగం కాగా, రెండవది మొదటి సంఘటనను మాఫీ చేసే ప్రయత్నంలో జరిగింది. ఆరుగురు కూలీల మృతదేహాలను తగలబెట్టేందుకు జవాన్లు రహస్యంగా ప్రయత్నిస్తుండగా చోటు చేసుకుంది. అమాయకులైన కూలీల మరణాలతో ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు జవాన్లపై దాడి చేశారు. దాంతో ఆర్మీ ఆపరేషన్ హెడ్ మరోసారి కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. ఏడుగురు మరణించారు. మరణించిన వారందరూ కూడా కోన్యాక్ గిరిజన తెగకు చెందినవారే.
టీమ్ కమాండర్‌ను ప్రధాన నిందితుడిగా సిట్ పేర్కొంది. మరో 29మంది సబార్డినేట్ ఆఫీసర్లపై కూడా చార్జిషీట్లు దాఖలు చేశారు. సాధారణ పౌరులను హత్య చేయడంలో తమ పాత్రకు గానూ సైనిక సిబ్బంది చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కొనడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు