టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుండి తప్పుకున్నారు. నకిలీ ఖాతాల సంఖ్య విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని ఆరోపిస్తూ 44 బిలియన్ల డాలర్ల డీల్ నుండి వైదొలిగారు. ట్విట్టర్‌కు సంబంధించిన ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని పలుమార్లు కోరినప్పటికీ సదరు సంస్థ విఫలమైందని..ఇది కంపెనీ పనితీరుకు ప్రాథమికమైనదని ఎలన్ మస్క్ తరపు న్యాయమూర్తులు తెలిపారు.
అయితే తాము న్యాయపోరాటానికి దిగుతామని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలో తెలిపారు. ఎలన్ మస్క్‌తో విలీన ఒప్పందాన్ని అమలు చేసేందుకు చట్టపరమైన చర్యలకు వెళతామని చెప్పారు. ఎలన్‌మస్క్‌కు ఒప్పంద ధరకు కంపెనీని అప్పగించేందుకు, నిబంధనల ప్రకారం లావాదేవీలు ముగించేందుకు సంస్థ కట్టుబడి ఉందని వెల్లడించారు.
నిబంధన ప్రకారం ఈ డీల్‌ను ఎలన్ మస్క్ పూర్తి చేయకపో బ్రేకప్ ఫీజు కింద ఒక బిలియన్ డాలర్ చెల్లించాల్సి ఉంటుంది. కాగా, కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్ ముందుకు వెళ్లదని మేలో ఎలన్ స్పష్టం చేశారు.
ట్విట్టర్ చెప్పిన దానికంటే స్పామ్ ఖాతాలు నాలుగింతలు అధికంగా ఉన్నాయనేది ఆయన వాదన. గత నెలలో కూడా నకిలీ ఖాతాల విషయంలో సరైన సమాచారం అందించకపోతే ఈ ఒప్పందం నుండి తప్పుకుంటానని ఎలన్ హెచ్చరించారు కూడా. అయితే ట్విట్టర్ సైతం ప్రతి రోజు మిలియన్ ట్వీట్లకు సంబంధించిన వాస్తవ డేటా సమాచారాన్ని అందించింది. ఈ ప్రైవేట్ డేటా నిజమైన ఖాతాలు, స్పామ్‌లను గుర్తించడానికి, నివారించడానికి సహాయపడుతుందని ట్విట్టర్ తెలిపింది.
ట్విట్టర్ స్వాధీనం తర్వాత సంస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరిగింది. వాటికి అనుగుణంగా ట్విట్టర్‌లోని టాలెంట్ అక్విజేషన్ టీంకు చెందిన 30 శాతం మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టింది ఆ సంస్థ. మరో 100 మంది ఉద్యోగులను తొలగించింది.
ఇందులో ప్రధానంగా రిక్రూటర్లు, కొత్త ఉద్యోగులను బోర్డులోకి తీసుకురావడానికి బాధ్యత వహించే వ్యక్తులే ఉన్నారు. అయితే, ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ ప్రకటించినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మస్క్ సూచనలతో ఖర్చులను తగ్గించుకోవడానికి నియామకాలను కూడా నిలిపివేసింది ట్విట్టర్, జూన్ మాసంలో ట్విట్టర్ ఉద్యోగులతో తొలి సమావేశం నిర్వహించిన మస్క్‌కు ఉద్యోగుల తొలగింపు ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైంది.
దానికి సమాధానమిచ్చిన ఆయన సంస్థ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఖర్చును సైతం తగ్గించుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ట్విట్టర్లో మార్పులు చేసుకున్నాయి కూడా. అయితే, ఇప్పుడు ఎలన్ మస్క్ ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు.