‘‘సింహాసనం ఖాళీ చేయండి. ప్రజలు వస్తున్నారు’’ అన్న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలు త్వరలోనే ఏపీలో నిజం కాబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. వైసీపీ నాయకుల దాష్టీకాలు, దౌర్జన్యాలు చూసి ప్రజలే వారిని సింహాసనం దించే సమయం దగ్గర పడుతోందని స్పష్టం చేశారు.
ఆదివారం విజయవాడలో జనవాణి-జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల దాష్టీకాలను తట్టుకోవ డానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తిరగబడే మైండ్ సెట్ లేకపోతే ఈ దోపిడీ దౌర్జన్యకాండ ఇలాగే సాగుతుందని ప్రజలను హెచ్చరించారు. “పవన్ కల్యాణ్ ఒక్కడే తెగిస్తే సరిపోదు. మీలో నాయకులు, నాయకురాళ్లు పుట్టాలి. కామన్ మినిమం ప్రోగ్రాం కింద ప్రభుత్వ పాలనను ఎదిరించే బాధ్యతను అంతా తీసుకోవాలి” అంటూ పిలుపిచ్చారు.
‘‘దౌర్జన్యాలు, దోపిడీలు చేసేది మీరు. ప్రజల్ని వేధించేది, హింసించేది మీరు. కౌరవుల లక్షణాలు ఉన్న మీరు మమ్మల్ని అనడం దారుణం. జనసేన పార్టీని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బింకాలు పలకొద్దు. ఇది మారిన కాలం. జనసేన కోసం జనం ఎదురుచూస్తున్న కాలం. మీరు ఎవరూ మామ్మల్ని ఆపలేరు’’ అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు.
“బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన విలువలు నేర్పిస్తాం. గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారిన ఏపీని కచ్చితంగా రక్షించేందుకు బాధ్యత తీసుకుంటాం” అని పవన్ స్పష్టం చేశారు. సమాజంలో అరాచకాలు చేసేవారు 25 మంది ఉంటే వారిని చూసి భయపడేవారు వేలల్లో ఉంటున్నారని అంటూ అలా భయపడే వారిలో ధైర్యం నింపడానికి తాను ముందుకొచ్చానని తెలిపారు.
ఈ ప్రయాణంలో పూర్తిగా దహించుకుపోవడానికి తాను సిద్ధం అని పేర్కొంటూ, కానీ ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరి గుండెల్లో బలమైన ధైర్యం మాత్రం నింపుతానని వెల్లడించారు. “ఇప్పుడు నా వద్దకు వచ్చిన సమస్యలన్నీ ప్రభుత్వం నెరవేర్చాల్సినవే. వారు చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడకు వచ్చారు. మీ ప్రభుత్వం బాగుంటే వరుసగా రెండో ఆదివారం కూడా 400కు పైగా పిటిషన్లు మా వద్దకు ఎందుకొస్తాయి?’’ అంటూ పవన్ ప్రశ్నించారు.
వెంట్రుక పీకలేరంటూ ప్లీనరీ సమయంలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పవన్ చమత్కరించారు. ‘‘కేశ సంపద చాలా విలువైంది. దాన్ని ప్రతిసారి పీక్కోకండి. రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల సమస్యల గురించి ప్రజావేదికల్లో మాట్లాడాల్సింది పోయి.. ప్రతిసారి మీరు మీ కేశాలకు పని చెబితే ప్రజలే త్వరలో వాటిని పూర్తిస్థాయిలో పీకే పనిలో ఉంటారు.’ అంటూ హెచ్చరించారు.