ఉత్తరప్రదేశ్‌కు ఆరవ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రాబోతోంది. 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ప్రారంభించనున్నారు. చిత్రకూట్-ఇటావా మధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్దేశిత గడువు కంటే 8 నెలల ముందు పూర్తయింది.
2020 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రధాని భరోసా ఇచ్చారు. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ నుంచి ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమై ఇటావా జిల్లాలోని కుడ్రయిల్ గ్రామం సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌తో కలుస్తుంది. ఏడు జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. చిత్రకూట్, బాండ, మహోబ, హమిర్పూర్, జలౌన్, అవురియా, ఇటావా జిల్లాను కలుపుతుంది.
బగన్, కెన్, శ్యామ, చందావల్, బిర్మా, యమున, బెట్వా, సెంగర్ వంటి పలు నదులను దాటుతూ వెళ్తుంది. నాలుగు లేన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో మరో 6 లేన్లు విస్తరించేందుకు అవకాశం ఉంది. దీనికి 13 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉన్నాయి.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా రూ.1,132 కోట్లు ఆదా చేసింది. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడం ద్వారా ఢిల్లీ-చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుంది. ఇంతకుముందు 9 నుంచి 10 గంటల పాటు ప్రయాణానికి పట్టేది. ఉత్తరప్రదేశ్‌కు రానున్న డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్ట్ సక్సెస్‌లో కూడా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే కీలకం కానుంది.