పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అదే రోజున రాష్ట్రపతి ఎన్నిక కూడా జరుగనుంది. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో అటవీ చట్టంలో మార్పులతో సహా 29 బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో ఐదు బిల్లులను ప్రభుత్వం గత సమావేశాల్లోనే ప్రవేశపెట్టింది.
వాటిలో నాలుగు బిల్లులు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్నాయి.కొత్త అటవీ నిబంధనలకు సంబంధించిన బిల్లుతో సహా పలు ప్రజావ్యతిరేక బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ప్రతిపక్షాల అభ్యంతరాలను బుల్డోజ్ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహ రచనలో పాలక పక్షం ఉంది. గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీసే అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచే యత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. వందలాది రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, దళిత, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలతో కూడిన భూమి అధికార్ ఆందోళన్ (బిబిఎ) ఇప్పటికే తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.
అంతరాష్ట్ర సహకార సంస్థల చట్ట సవరణతో బాటు , ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ (దివాలా) చట్ట సవరణ, కాఫీ (ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీసెస్ హబ్స్ ్ల, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్), గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ, నేషనల్ డెంటల్ కమిషన్, ఐఐఎం, సెంట్రల్ యూనివర్శిటీలు, మైన్స్ అండ్ మినరల్స్ , విద్యుత్, తదితర అంశాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుంచనుంది.
ఇప్పటికే పార్లమెంటులో ప్రవేశపెట్టిన వన్యప్రాణుల (రక్షణ), సముద్ర దొంగతనాల నిరోధక చట్ట్లం, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమం, డోపింగ్ను అరికట్టడం వంటి అంశాలపై చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులు ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు కూడా సభ ఆమోదం కోసం వేచి చూస్తున్నది.
ఇలా ఉండగా, పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు సాంప్రదాయంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం జరిపిన అఖిలపక్ష సమావేశంలో అత్యధిక ప్రతిపక్షాలు పాల్గొనలేదు. సభను సజావుగా నిర్వహించాలని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు, సభ్యులు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి ఎక్కువ పార్టీలు గైర్హాజరయ్యాయి. అధికార ఎన్డిఎ తరపున బిజెపి, అప్నాదళ్, ఎల్జెఎస్పి హాజరుకాగా, ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్, డిఎంకె, వైసిపి హాజరయ్యాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలు జరపాలని పార్టీ నేతలందరికీ విజ్ఞప్తి చేసినట్లు ఓం బిర్లా తెలిపారు.
ఈ పార్లమెంట్ సమావేశాలు 18 సిట్టింగ్లు జరుగుతాయని, మొత్తం 108 గంటలు సమయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు జీరో అవర్ కోసం ఉదయం 9 గంటల లోపు నోటీసులు ఇచ్చేవారని, ఇప్పుడు ఉదయం 8 గంటల లోపే నోటీసులు ఇవ్వాలని తెలిపారు.