శ్రీలంకలో కొత్త నాయకత్వం కోసం బుధవారం జరిగిన ఓటింగ్లో యూఎన్పీ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటింగ్ జరిగింది. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికలో రణిల్ విజయం సాధించారు.
శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత రణిల్ పార్లమెంట్లో మాట్లాడుతూ ”దేశం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందు పెను సవాళ్లున్నాయి. ప్రస్తుతం ఈ ద్వీపదేశం నిత్యావసరాలు తీర్చుకోలేని స్థితిలో అల్లాడిపోతోంది. దీన్నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది” అని తెలిపారు.
ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు కలిసి పనిచేద్దామని ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలతోపాటు ఎంపీలను విక్రమసింఘే కోరారు. అందరితోనూ చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు. తనను వ్యతిరేకిస్తున్న శ్రీలంక తమిళ నేతలనూ దేశ పునర్నిర్మాణంలో చేతులు కలపాలని కోరారు.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక ప్రజలు రాజపక్స కుటుంబ పాలనతో విసిగిపోయారు. ఆ రాజపక్స సోదరులు అధ్యక్ష, ప్రధాని పదవులను నుంచి గద్దె దిగే వరకూ తీవ్రస్థాయి ఆందోళనలు చేపట్టారు. దాంతో గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవి నుంచి దిగిపోగా.. రణిల్ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో కొత్త నాయకత్వం కోసం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. ఆ రేసులో రణిల్తో పాటు మరో ఇద్దరు పోటీలో నిలిచారు. అధికార పార్టీ శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్పీపీ) వర్గానికి చెందిన దులస్ అలహాప్పెరుమాతో పాటు వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనూర కుమార దిశనాయకే పోటీ చేశారు. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగాయ (ఎస్జేబీ) నాయకుడు సాజిత్ ప్రేమదాస.. అలహాప్పెరుమాకు మద్దతు ప్రకటించారు.
దాంతో మొదట్లో దులస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు 134 ఓట్లతో రణిల్కే విజయం దక్కింది. శ్రీలంకలో మొత్తం 225 స్థానాలున్నాయి. మెజార్టీ మార్కు కోసం కావాల్సిన సంఖ్య 113.కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తైనా ఈ ద్వీప దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
73 ఏళ్ల విక్రమసింఘే ఆరుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. గత ఐదు దశాబ్దాలుగా ఆయన పార్లమెంటులో కొనసాగుతున్నారు. మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ ఏడాది మేలో విక్రమసింఘేను తిరిగి ప్రధానమంత్రిగా నియమించారు.
మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పరారైన నేపథ్యంలో ఈనెల 13 నుంచి విక్రమసింఘేనే తాత్కాలిక దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు ఆయనను గొటబాయ మనిషిగా అనుమానిస్తున్నారు. అందుకే విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలంటూ వారంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రణిల్ ఎన్నికపై ఆందోళనకారులు మండిపడ్డారు. అధ్యక్ష కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఇదివరలో ఆరు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో భారత్కు ఎలాంటి ప్రమేయం లేదు
కాగా, శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి నాయకులను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొలంబోలోని భారత హైకమిషన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార, కల్పిత ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈమేరకు ట్విట్టర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్కు ఎలాంటి ప్రమేయం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, కల్పితం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోదు’ అని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.