భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికలలో వేగంగా ముందడుగు వేస్తున్నారు. ఆ పదవికి చేరుకోవడంకు చాలా సమీపంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రధాని పదవికి పోటి పోటీ పడుతున్న తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. ఫలితంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు.
అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ నూతన ప్రధాని స్థానం కోసం జరుగుతున్న పోటీలో ఐదో రౌండ్ ఎన్నికలోనూ గెలిచి తుదిపోరుకు చేరారు. ఐదో రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్ ట్రస్‌తో తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. టోరీ పార్టీ లీడర్షిప్ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన చివరి, ఐదో రౌండ్లో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో రిషీ సునాక్ 137 ఓట్లతో అగ్రస్థానం సాధించగా, 113 ఓట్లతో ట్రస్ రెండో స్థానంలో నిలిచారు.
రిషికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన పెన్నీ మోర్డెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది సభ్యుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్లే బ్రిటన్ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంటారు. రిషికి లిడ్ ట్రస్‌తో హోరాహోరీ పోరు ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ట్రస్‌వైపే మొగ్గుచూపే అవకాశాలు కూడా లేకపోలేదు.
మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ పోలింగ్‌లో 118 మంది ఎంపీల మద్దతు సాధించిన రిషీ బుధవారం మరో 19 ఓట్లు అదనంగా పొందడం విశేషం. తుది పోటీకి చేరిన రిషీ, ట్రజ్లో ఒకరిని 1,80,000 మందికి పైగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటింగ్ ద్వారా తమ నేతగా ఎన్నుకుంటారు.
వీరంతా ఆన్లైన్ లేదా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పార్టీ సభ్యుల మద్దతు కోసం రిషీ, ట్రజ్ రాబోయే కొన్ని వారాల పాటు విస్త్రత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం జరిగే టీవీ డిబేట్లో వీరిద్దరూ ముఖాముఖి తలపడనున్నారు. సెప్టెంబర్ 5న బ్రిటన్ కొత్త ప్రధాని మంత్రి పేరును ప్రకటిస్తారు.
రిషి సోమవారం బీబీసీ ఛానెల్లో డిబేట్లో పాల్గొనాల్సి ఉంది. సెప్టెంబర్ 5న జరిగే బ్యాలట్ ఓటింగ్ నాటికి మరింత మందిని తన వైపు తిప్పుకుంటే రిషి విజయం నల్లేరుపై నడకే అవుతుంది. అప్పుడు బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.